విద్యార్థినికి వైద్యం అందించడంలో జాప్యం? | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి వైద్యం అందించడంలో జాప్యం?

Aug 10 2026 12:22 AM | Updated on Aug 10 2026 12:22 AM

రెండు గంటల పాటు కాలయాపన చేశారంటూ తల్లిదండ్రుల ఆరోపణ

ఇంజక్షన్‌ తర్వాత పరిస్థితి

విషమించిందని ఆవేదన

భద్రాచలంఅర్బన్‌: అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్‌ విద్యార్థినికి సకాలంలో వైద్యం అందించకుండా కళాశాల సిబ్బంది జాప్యం చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పట్టణంలోని పాత ఎల్‌ఐసీ రోడ్డులో గల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించగా ఇంజక్షన్‌ వేసిన తర్వాత తమ కుమార్తె ఆరోగ్యం మరింత క్షీణించిందని విద్యార్థిని తండ్రి ఎర్రయ్య తెలిపాడు. పట్టణంలోని మారుతి పారామెడికల్‌ కళాశాలలో జీఎ్‌ఎం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మంజుల ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించాలని మంజుల కళాశాల సిబ్బందిని కోరినప్పటికీ వెంటనే స్పందించలేదని, దాదాపు రెండు గంటల పాటు జాప్యం చేసినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాను కళాశాల యాజమాన్యానికి ఫోన్‌ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. వైద్యులు ఇంజక్షన్‌ వేయగా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆరోపిస్తున్నారు. కాగా, విద్యార్థిని కొంతకాలంగా సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతోంది. అయితే, తాము సకాలంలోనే స్పందించి ఆస్పత్రికి తీసుకొచ్చామని కళాశాల సిబ్బంది చెప్పారు. విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement