భద్రాచలం: మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో రామయ్య నిత్యకల్యా ణం శనివారం వైభవోపేతంగా జరిగింది. ఆల య అభివృద్ధి పనుల్లో భాగంగా తాత్కాలిక నిత్యకల్యాణ వేదికను మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసి, రామ సేవా మండపంగా నామకరణం చేశారు. దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం నిత్యకల్యాణానికి కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
‘శాకంబరి’ అవతారానికి కూరగాయలు వితరణ
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారు ఆదివారం శాకంబరిదేవిగా దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలను శనివారం భక్తులు వితరణ చేశారు. సంకా రామారావు 900 సొరకాయలు, 30 కేజీల క్యాప్సికమ్, అరటిగెలలు, తాటికొండ సురేష్ 30 కేజీల క్యారెట్, 30 కేజీల బెండకాయలు అందజేసినట్లు ఆలయ ఈఓ విజయ్‌కుమార్ తెలిపారు.
భూవివాదంలో జోక్యం.. ఎస్‌ఐ సస్పెన్షన్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని సుజాతనగర్ ఎస్సై రమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాదం విషయంలో ఓ మిలిటరీ ఉద్యోగి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైని సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇతర కారణాలతో అదే ఠాణాలోని మరో మహిళా ఎస్సైని కూడా సస్పెండ్ చేస్తారని పోలీస్ శాఖలో కూడా ప్రచారం జరిగింది. అయితే పోలీస్ అధికారులు ధ్రువీకరించలేదు. జిల్లా, డివిజన్ అధికారులను ఈవిషయమై వివరణ కోరగా.. ఎస్‌ఐ విధుల్లో లేని మాట నిజమేనని, సస్పెన్షన్ విషయం మాత్రం పూర్తిస్థాయిలో తమకు తెలియదని చెప్పారు.
తాలిపేరుకు వరద ఉధృతి
చర్ల: తాలిపేరు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు 23,898 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 28,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, మరో 2 గేట్లను ఫ్రీ ఫ్లోలో ఉంచారు. ప్రాజెక్ట్ ఎఫ్‌ఆర్‌ఎల్ 74 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 73.63 మీటర్లకు చేరుకుంది. తాలిపేరు ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 730 మిలియన్ క్యూబిక్ ీమీటర్లు (ఎంసీఎఫ్‌టీ) కాగా, ప్రస్తుతం 659 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉంది. కాగా, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మత్స్య రైతులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: మండలంలోని పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన పీ.వీ.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన మత్స్య రైతులకు ఇస్తున్న శిక్షణ శనివారం ముగిసింది. ‘బయోప్లాక్ విధానంలో చేపల సాగు’ అంశంపై ఇక్కడ మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణలో పలు జిల్లాల నుంచి 25 మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.


