కాలువలకు భూసేకరణ.. | - | Sakshi
Sakshi News home page

కాలువలకు భూసేకరణ..

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

రెండేళ్ల క్రితం మంజూరైన సీతారామ ప్రాజెక్ట్‌ డిస్ట్రిబ్యూటరీ కాలువలు

అప్పటి నుంచి టెండర్ల దశలోనే

మగ్గుతున్న పనులు

ఎట్టకేలకు నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం

రెండేళ్లుగా టెండర్లు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా జిల్లాలో కొత్తగా 72 వేల ఎకరాల ఆయకట్టు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు చండ్రుగొండ, పాల్వంచ మండలాల పరిధిలో భూసేకరణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.

రెండేళ్ల క్రితం..

సీతారామ ప్రాజెక్ట్‌లోని మూడు పంప్‌హౌస్‌లతోపాటు రాజీవ్‌ కెనాల్‌ను 2024 ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. ఆ సమయంలోనే జిల్లా పరిధిలో కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. పనులను 1, 2, 7, 8 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో 7, 8 ప్యాకేజీల కింద నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో గోదావరి నీరు పారే అవకాశం ఉంది. యాతాలకుంట టన్నెల్‌ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో త్వరలో అశ్వారావుపేట నియోజకర్గంలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్యాకేజీలు 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ పనులు జరిగితే కొత్తగూడెం, పినపాక నియోజకర్గాల పరిధిలో కొత్తగా సుమారు 72 వేల ఎకరాలకు గోదావరి నీరు అందే అవకాశం ఉంది.

భూసేకరణ షురూ

రూ.వేల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టు అందివ్వలేదని సీతారామపై పడిన అపవాదును చెరిపేసే పనుల్లో మరో కీలక అడుగు పడింది. ప్యాకేజీ 1, 2ల కింద డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల కోసం భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు శుక్ర, శనివారాల్లో జారీ అయ్యాయి. ప్యాకేజీ–2లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ 15 ఆర్‌ కోసం చండ్రుగొండ మండలం పోకలగూడెంలో 89 ఎకరాలు, ప్యాకేజీ–1లో పాల్వంచ మండలం దంతెలబోరలో 73 ఎకరాలు సేకరించే ప్రక్రియ మొదలైంది. భూసేకరణ చట్టం– 2013 ద్వారా ప్రక్రియ కొనసాగించనున్నారు.

డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు 1, 2లకు సంబంధించి కాలువల నిర్మాణ పనులకు 2024 అక్టోబరులో టెండర్లు పిలిచారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో చిక్కుకుంది. గడిచిన రెండేళ్లుగా కనీసం కాలువ నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియలో కూడా వేగం కనిపించలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం జరగకపోవడంతో ఎత్తిపోతలు మొదలై రెండేళ్లయినా జిల్లాలో కొత్త ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. కేవలం ఈ సీజన్‌లో ములకలపల్లి మండలంలో కొన్ని చెరువులు నింపేందుకు గోదావరి జలాలు అక్కరకు వచ్చాయి. దీంతో పాటు గత వేసవి, ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో తాగునీటి అవసరాల కోసం వైరా రిజర్వాయర్‌కి గోదావరి నీరు ఎత్తిపోసేందుకు సీతా రామ ప్రాజెక్ట్‌ ఉపయోగపడినట్టయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement