ప్రకృతితో మమేకమై అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించిన ఆదివాసీలు క్రమంగా ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సదుపాయాలు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ చైతన్యం, ముందడుగు ఆదివాసీ సమాజం మొత్తంలో లేదు. పాలకులు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే ఆదివాసీలు అందరూ ప్రగతిబాట పట్టే అవకాశం ఉంది. –పాల్వంచరూరల్/భద్రాచలం
● సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఆదివాసీలు ● ఉన్నత విద్యతో కొలువులు సాధిస్తున్న అడవిబిడ్డలు ● వలస ఆదివాసీల్లో ఇప్పుడిప్పుడే ముందడుగు
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
జిల్లావ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు అధిక సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. తొలుత అడవే వీరి జీవనానికి ప్రధాన ఆధారంగా ఉండేది. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధి పొందేవారు. క్రమంగా వ్యవసాయం చేయడంతోపాటు వివిధ రకాల వృత్తి, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి కొలువులు కూడా చేపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వస్త్రధారణపైనా ఆసక్తి చూపుతున్నారు. పలువురు ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీలు చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. ఐటీడీఏ పరిధిలో 32 గురుకుల, ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 14,253 గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60 శాతం మంది ఆదివాసీలే ఉన్నారు.


