సూపర్‌బజార్(కొత్తగూడెం): వరి సాగు తగ్గించి తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశం నిర్వహించారు. తొలుత అధికారులు వర్షపాతం, నీటి లభ్యత వివరాలను వెల్లడించారు. జిల్లాలో 455.8 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సాధారణ వర్షపాతం 561.4 మి.మీ కాగా, 18.8 శాతం లోటు నమోదైందని చెప్పారు. జూన్‌లో 4.3 శాతం, జూలైలో 31.8 శాతం లోటు ఉండగా, ఆగస్టులో ఇప్పటివరకు సాధారణం కంటే 1.2 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వివరించారు. జిల్లాలో 2,384 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, సుమారు 800 చెరువుల్లో 50 శాతానికి మించి నీరు చేరిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో కూడా నీరు చేరుతోందని చెప్పారు. వర్షాకాలం సీజన్‌లో 4,86,048 ఎకరాల సాగు లక్ష్యానికి 4,21,367 ఎకరాల్లో పంటలు సాగు చేపట్టారని, 86.69 శాతం నమోదైందని తెలిపారు. పత్తి సాగు లక్ష్యం చేరిందని, వరి సాగు లక్ష్యం 31,500 ఎకరాలు కాగా 70,652 ఎకరాల్లో రైతులు సాగు చేశారని, దీంతో 224.29 శాతం నమోదైనట్లు వివరించారు. నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెసర, మినుము, కంది, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
పంటల వైవిధ్యీకరణ వైపు...
కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైజ్డ్ బెడ్ విధానం, నీటి సంరక్షణ, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, నేలలో తేమను సంరక్షించే పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, డీఏఓ బాబూరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, సీపీఓ సునీత, మిషన్ భగీరథ ఈఈలు నళిని, తిరుమలేష్, నీటిపారుదల శాఖ ఈఈలు, డీఈలు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


