● వరి నాట్ల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి రాక ● నారు ముదురుతుండటంతో రైతుల్లో ఆందోళన
బూర్గంపాడు: ఎల్‌నినో ప్రభావంతో ఆగస్ట్ మొదటివారం వరకు వరుణుడు ముఖం చాటేయడంతో వరి సాగుకు ప్రతికూలంగా మారింది. వరినార్లు పోసుకుని నాట్లు వేసేందుకు ఎదురుచూసిన రైతు లు వరిసాగుపై ఆశలు వదులుకున్నారు. వ్యవసాయశాఖ కూడా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించింది. ఆగస్ట్ మొదటివారంలో ఓ మోస్తరు వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలకు కొంతమేర నీరు చేరింది. దీంతో రైతులందరూ ఒకేసారి వరినాట్లు వేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. మాగాణులు దమ్ము చేసి వరినాట్లు వేసేందుకు సిద్ధమైన తరుణంలో కూలీల కొరత ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికే వరి నార్లు ముదిరిపోతున్నాయనే ఆందోళనలో ఉన్న రైతులకు కూలీల కొరత మరింత ఇబ్బందికరంగా మార్చింది. స్థానికంగా ఉన్న కూలీలు వరినాట్లకు సరిపోకపోవటంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను రపిస్తున్నారు.
1.90 లక్షల ఎకరాల్లో..
ఈ ఏడాది జిల్లాలో 1.90లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం సగానికి తగ్గుతుందని తరువాత భావించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరిసాగు మళ్లీ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు నీరు చేరటం, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమవటంతో వరిసాగు పెరుగు తోంది. తుమ్మలచెరువు, దోమలవాగు చెరువులకు మారెళ్లపాడు, సీతారామ ప్రాజెక్ట్‌ల నుంచి నీరు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదారేళ్లుగా వరినాట్లకు బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. జిల్లాలో కూలీల సంఖ్య ఏటికేడు తగ్గుతుండటం పంటల సాగుకు ప్రతిబంధకమవుతోంది. జిల్లాలో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు పెరుగుతుండటంతో కూలీలు ఆ పను లకు ఎక్కువగా వెళ్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర పనులకు వెళ్తున్న కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుండటంతో గ్రామీణ కూలీలు ఆ పనులకు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కువ మంది మహిళా కూలీలు జామాయిల్ నర్సరీల్లో పనులకు వెళ్తున్నారు. బూర్గంపాడు మండలం నుంచి ఆంధ్రాలో విలీనమైన వేలేరు, పెదరావిగూడెం, అల్లిగూడెం, గణపవరం, ఇబ్రహీంపేట, బంజరగూడెం గ్రామాల్లో వేలాదిగా జామాయిల్ నర్సరీలున్నాయి. ఈ నర్సరీలలో పనిచేసేందుకు బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, పాల్వంచ, ముల్కలపల్లి మండలాలకు చెందిన మహిళా కూలీలు ఎక్కువగా వెళ్తున్నారు. ప్రతిరోజు కనీసం 3 వేల మందికి పైగా కూలీలు జామాయిల్ నర్సరీల్లో పనులకు వెళ్తున్నారు. దీంతో ఆయా మండలాల్లో వరినాట్లు వేసేందుకు, ఇతర వ్యవసాయ పనులకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
మధ్యవర్తుల ద్వారా..
వరినాట్లు ముమ్మరంగా సాగుతుండటంతో బెంగాల్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. కొందరు మధ్యవర్తులు వలస కూలీలను తీసుకొచ్చి జిల్లాలో వరినాట్లు వేయిస్తున్నారు. గతేడాది ఎకరం వరి నాటేందుకు రూ.4,500 చెల్లిస్తే, ఈ ఏడాది ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తున్నారు. ఆగస్ట్ నెలాఖరు వరకు జిల్లాలో వరినాట్లు కొనసాగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వరుసగా వరి నాటుతున్నారు. దీంతో ఎరువులు చల్లుకునేందుకు, పురుగుమందులు పిచికారీ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని రైతులంటున్నారు. అంతేకాకుండా గాలి, వెలుతురు మొక్కకు బాగా అందుతుండటంతో దిగుబడులుకూడా పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.


