రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లా అథ్లెట్లు ప్రతిభ చాటి పది పతకాలు సాధించారు. జిల్లా క్రీడాకారులు నాలుగు బంగారు, నాలుగు రజత, రెండు కాంస్య పతకాలు సాధించారని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.మహీధర్‌ తెలిపారు. పతకాలు సాధించిన వారిలో చర్లకు చెందిన ఎం.శ్రీవిద్యదొర, భద్రాచలానికి చెందిన ఎస్‌కే అమ్రిన్‌, టి.అవంతిక, సాయిమంజుశ్రీ, బి.పృథ్విక, కొత్తగూడెంనకు చెందిన సీహెచ్‌ వేదశ్రీ, బి.శైలేశ్‌, పాల్వంచకు చెందిన బి.సౌమ్య, ఎ.నందిని, ఎస్‌.అక్షిత ఉండగా డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి విజేతలను, కోచ్‌లు పి.నాగేందర్‌, డి.మల్లికార్జున్‌, జన్ను గిరిప్రసాద్‌ను అభినందించారు.

నవభారత్‌ స్కూల్‌

హెచ్‌ఎంకు డాక్టరేట్‌

పాల్వంచ: నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌ హెచ్‌ఎం ఎన్‌వీకే ప్రసాద్‌కు కెన్నెడీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన డాక్టరేట్‌ అందుకున్నారు. పాఠశాల విద్యలో బోధనా ప్రమాణాలు పెంపొందించడం, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందించడంలో చేసిన కృషికి గాను పురస్కారం లభించిందని తెలిపారు. ఆయన్ను ఉపాధ్యాయులతోపాటు పలువురు అభినందించారు.

పోగొట్టుకున్న ఫోన్‌

అప్పగించిన పోలీసులు

కొత్తగూడెంఅర్బన్‌: పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఆ వ్యక్తికి పోలీసులు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం ప్రగతినగర్‌కు చెందిన పారుపల్లి రమేశ్‌ గత జనవరి 15వ తేదీన సూపర్‌బజార్‌ నుంచి బస్టాండ్‌ వెళ్తుండగా మార్గమధ్యలో ఫోన్‌ పోగొట్టుకున్నాడు. మీ సేవలో రిజిస్టర్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం త్రీటౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ విజయకుమారి, కానిస్టేబుల్‌ విష్ణువర్దన్‌ రమేశ్‌కు ఫోన్‌ను అప్పగించారు.

రేషన్‌ దుకాణంలో

తాచుపాము కలకలం

మణుగూరుటౌన్‌: మున్సిపాలిటీ పరిధి సుందరయ్యనగర్‌లోని రేషన్‌ దుకాణంలో తాచు పాము కలకలం సృష్టించింది. గదుల్లో రేషన్‌ బియ్యం బస్తాల మధ్యలో ఉన్న పాము అలికిడితో నిర్వాహకురాలు, రేషన్‌ తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్‌ క్యాచర్‌ ముజాఫర్‌కు సమాచారం అందించగా, సుమారు గంట పాటు రెస్క్యూ చేసి పామును పట్టి అడవిలో వదిలేయడంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నారు.

టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ

ఇన్‌చార్జిపై పోక్సో కేసు

వైరా: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా చెలామణి అవుతున్న గౌరవరపు డేవిడ్‌రాజ్‌ శనివారం మద్యం మత్తులో వైరాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి గణితం చెబుతానంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పడంతో వారు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రామారావు చేరుకుని డేవిడ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. కాగా, డేవిడ్‌పై గతంలోనే రౌడీషీట్‌ నమోదైంది.

స్కూటీ అపహరణ

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి తుమ్మూరి రామారావు వీధిలో స్కూటీని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ తన ఇంటిముందు శుక్రవారం రాత్రి స్కూటీ పార్క్‌ చేశాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని అపహరించగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement