బైక్‌ను ఢీకొట్టిన లారీ.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ..

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

పినపాక: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మండలంలోని జానంపేట శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హిమవతి, మద్దెల రాణి విధులు ముగించుకుని హిమవతి తండ్రి నరసింహారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. జానంపేట శివారులో లారీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనం లారీ టైర్ల కింద పడింది. నరసింహారావు, హిమవతిల కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. రాణికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 ద్వారా క్షతగాత్రులను మణుగూరులోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ఇల్లెందురూరల్‌: మండలంలోని లచ్చగూడెం గ్రామపంచాయతీ కొమ్ముగూడెంకాలనీ గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటిని నిర్మించుకుంటున్న నాగరాజు పక్కనే తాత్కాలిక ఇంటిని ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. శనివా రం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.

కాలేజీ యాజమాన్యం తీరుపై ఫిర్యాదు

చుంచుపల్లి: ప్రత్యేక సెలవు రోజుల్లో ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు తరగతులు నిర్వహించడాన్ని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఖండిస్తూ శనివారం లక్ష్మీదేవిపల్లిలోని కృష్ణవేణి కళాశాల యాజమాన్యానికి విన్నవించేందుకు వెళ్లారు. అయి తే, తమపై దుర్భాషలాడుతూ దాడి చేశారని ఆరోపిస్తూ నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం వ్యాపార దృక్పథంతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ క్లాసులు నిర్వహించడాన్ని ప్రశ్నించినందుకు కళాశాల నిర్వాహకులు దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. కాగా, ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తప్పిన ప్రమాదం..

పినపాక: ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్‌లోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో హైడ్రోజన్‌ పెరాకై ్సడ్‌ తరలిస్తున్న ఓ లారీ శనివారం అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బంక్‌లోకి వెళ్తున్న ఖాళీ లారీ అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇన్సూరెన్స్‌

నగదు పంపకంలో విభేదాలు

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పాల్వంచరూరల్‌: మృతిచెందిన కన్నతల్లి ఇన్సూరెన్స్‌ డబ్బుల పంపకం విషయంలో ముగ్గురు కొడుకుల మధ్య విభేదాలు తలెత్తడంతో చిన్నకొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పునుకుల గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని కోడిపుంజులవాగు గ్రామ పంచాయతీ పరిధిలోని పూసలతండా గ్రామానికి చెందిన బాదావత్‌ తిరుపతి, సంతు దంపతులకు బాలాజీ, విజయ్‌, సాగర్‌ కుమారులు ఉన్నారు. తల్లి సంతు ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో రైతు బీమా కింద రూ.5 లక్షలు వచ్చాయి. ఈ నగదు పంపిణీ విషయంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. దీంతో చిన్నకొడుకు సాగర్‌ శనివారం పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సాయం పేరిట నగదు చోరీ

నేలకొండపల్లి: దివ్యాంగులకు సాయం చేస్తాను, కొంత డబ్బు చెల్లిస్తే అంతకు మించి ఇస్తానని నమ్మబలికిన వ్యక్తి రూ.15 వేలు చోరీ చేసిన ఘటన ఇది. నేలకొండపల్లికి చెందిన మండల కేంద్రంలో ఓ దివ్యాంగుడు శనివారం స్కూటీపై పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉండగా, పల్సర్‌ బైక్‌పై మాస్క్‌ పెట్టుకున్న గుర్తుతెలియని యువకుడు వచ్చాడు. ఎంత డబ్బు ఉంటే అంతకు మించి సాయం చేస్తాననడంతో సదరు దివ్యాంగుడు జేబులో రూ.15 వేల నగదు తీస్తున్నాడు. ఆ నగదు తాను లెక్కిస్తానంటూ యువకుడు లాక్కుని పరారయ్యాడు. అదే సమయాన వచ్చిన చెన్నారానికి చెందిన దివ్యాంగుడు వీరయ్య తన వాహనంపై వెంబడించినా నిందితుడు వేగంగా వెళ్లిపోవడంతో దొరకలేదు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనంపై మాస్క్‌ ధరించి తిరుగుతున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement