జూలూరుపాడు: ఇంజనీరింగ్ విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని అన్నారుపాడుకు చెందిన బానోత్ నరసింహ, విజయ దంపతుల కుమారుడు కిరణ్ (19) సుజాతనగర్ మండలం వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు మనస్పర్దల కారణంగా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. తండ్రి నరసింహ వద్ద కిరణ్ ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. తల్లిదండ్రులు కలవరనే ఉద్దేశంతో తీవ్ర మనోవేదనకు గురైన కిరణ్ మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన పురుగులమందు తాగాడు. తండ్రి కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ శుక్రవారం కిరణ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరరావు పేర్కొన్నారు.
గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
బూర్గంపాడు: గోదావరి బ్రిడ్జి సారపాక వైపున 3వ ఫిల్లర్ వద్ద శనివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని నీటిలో తేలిన మృతదేహాన్ని గజఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయసు కలిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రి మర్చూరీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వాలని ఎస్‌ఐ నాగభిక్షం కోరారు.
భార్య మందలించిందని గడ్డిమందు తాగిన భర్త
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
పాల్వంచరూరల్: పత్తి చేనుకు ఓ వ్యక్తి గడ్డి మందు పిచికారీ చేయగా పత్తి మొక్కలు కూడా చనిపోవడంతో ఆయన భార్య మందలించింది. మనస్తాపం చెందిన భర్త అదే గడ్డిమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన తాపాల ఎల్లయ్య (39) ఈ నెల 6న పత్తిచేనులో గడ్డి మందు పిచికారీ చేశాడు. గడ్డితోపాటు పత్తి చెట్లు కూడా మొత్తం చనిపోవడంతో ఆయన భార్య లలిత మందలించింది. మనస్తాపానికి గురైన ఎల్లయ్య అదే గడ్డిమందు తాగగా 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుడువెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.


