భద్రాచలంఅర్బన్: రూ.52 కోట్ల భారీ మోసం కేసులో భద్రాచలం పట్టణానికి చెందిన భరత్‌ని లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే భద్రాచలం సబ్‌జైలుకి పంపారు. మరోవైపు అతడికి సంబంధించి, సీజ్ చేసిన ఇంట్లో పోలీసులు విస్తృతంగా సోదాలు, విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇంటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. గదులు, అల్మారాలు, పత్రాలు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు, ఆర్థి క లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర సమాచారాన్ని గుర్తించే దిశగా తనిఖీలు సాగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నిందితుడి తల్లి, కుటుంబ సభ్యులను సైతం అదే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంచి పోలీసులు విడివిడిగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.52 కోట్ల మోసం వ్యవహారానికి సంబంధించి కుటుంబ సభ్యులకు తెలిసిన విషయాలు, నిందితుడి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, డబ్బు ఎక్కడికి తరలించారనే అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకరి సమాధానాలు మరొకరికి తెలియకుండా వేర్వేరుగా విచారిస్తూ.. వారి నుంచి సేకరించిన వివరాలను ఇంట్లో లభిస్తున్న పత్రాలు, ఇతర ఆధారాలతో సరిపోల్చుతున్నట్లు తెలుస్తోంది. నిందితుడు భరత్ జైలులో ఉండగా.. అతని ఇంట్లో ఒకవైపు పోలీసులు పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించడం, మరోవైపు కుటుంబ సభ్యులను విడివిడిగా విచారిస్తుండటం కేసు దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల్లో ఏమైనా కీలక పత్రాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లేదా ఇతర వస్తువులు లభించాయా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే సోదాల సమయంలో పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారనే వివరాలు, కుటుంబ సభ్యుల విచారణలో ఏం వెల్లడైందనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సీజ్ చేసిన ఇంట్లో పోలీసుల సోదాలు?


