సద్వినియోగం చేసుకోవాలి
● ఎన్‌ఎంఎంఎస్ ద్వారా ఏటా రూ.12వేలు ● దరఖాస్తుకు ఈ నెల 24వరకు అవకాశం
టేకులపల్లి: ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12,000 చొప్పున, నాలుగు సంవత్సరాల్లో మొత్తం రూ.48,000 ఆర్థిక సాయం నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.5 లక్షల లోపు ఉండాలి. రెసిడెన్షియల్ (గురుకుల) పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఈ నెల 24 తేదీ వరకు గడువు ఉంది. నవంబర్ 1న పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీలైతే రూ.50, బీసీ, ఓసీలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీ స్కూల్, బాబు క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా కేంద్రప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎనిమిదో తరగతిలో పరీక్ష రాసి అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏటా రూ.12వేల సాయం అందుతుంది. విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– అజ్మీరా జగన్‌నాయక్, ఎంఈఓ, టేకులపల్లి


