గోదావరిలో మృతదేహమై తేలిన వ్యక్తి
భద్రాచలంఅర్బన్: మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన వృద్ధుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగానే అతడు భద్రాచలం గోదావరిలో మృతదేహంగా తేలాడు. అతడిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన గోద రాములు (75)గా పోలీసులు గుర్తించారు. తిరువూరు పోలీసులు మిస్సింగ్ కేసు దర్యాప్తు, సీసీటీవీ దృశ్యాలు, భద్రాచలం టౌన్ పోలీసుల ప్రచారం నేపథ్యంలో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. గోద రాములుకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈ నెల 5న తిరువూరు బస్‌స్టాండ్ నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అనంతరం ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, రాములు భద్రాచలం బస్సు ఎక్కిన దృశ్యాలు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు గురువారం రాత్రి భద్రాచలం చేరుకుని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం భద్రాచలం వైకుంఠధామం సమీపంలోని గోదావరి ఒడ్డున గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు మృతుడి ఫొటో, దుస్తుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఫొటోను చూసిన కుటుంబ సభ్యులు టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మృతదేహాన్ని రాములుదేనని నిర్ధారించారు. రాములు కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


