సురక్షిత డ్రైవింగ్‌పై డ్రైవర్లకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సురక్షిత డ్రైవింగ్‌పై డ్రైవర్లకు శిక్షణ

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌ పరిధిలోని డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ ఎ.సరిరామ్‌ తెలిపారు. రీజియన్‌ పరిధి ఏడు డిపోల డ్రైవర్లకు ఖమ్మం కొత్త బస్టాండ్‌ మీటింగ్‌హాల్‌లో శుక్రవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్‌ సమయాన అప్రమత్తతపై వివరించారు. మంచి ఆహార అలవాట్లను కలిగి ఉండి సరైన విశ్రాంతి తీసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్‌ సీఐ రవికుమార్‌, ఏఎంవీఐ మధు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు.

డీపీఆర్‌ను రద్దు చేయాలి

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధి పేరిట రహస్యంగా రూపొందించిన డీపీఆర్‌ను రద్దు చేయాలని స్వతంత్ర కార్పొరేటర్‌ దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలోని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ భీమా శ్రీవల్లి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలపై అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని తెలిపారు. జూన్‌ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.300 కోట్లు, జర్మనీ బ్యాంకు రుణం రూ.300 కోట్లతో అభివృద్ధి పనుల అంశాన్ని కౌన్సిల్‌లో పెడితే తాము వ్యతిరేకించామని, సీపీఐ, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఆమోదించారని, గతంలో ప్రపంచ బ్యాంకు నిధులను వ్యతిరేకించిన ఎమ్మెల్యే, సీపీఐ నేతలు ఇప్పుడు ఎలా స్వాగతిస్తున్నారని నిలదీశారు. సుమారు రూ.8 కోట్లు పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ శ్రీవల్లి, నాయకుడు శ్రీధర్‌ మాట్లాడారు.

‘నవోదయ’ దరఖాస్తుల గడువు పొడిగింపు

కరకగూడెం: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027 – 28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్‌ నవోదయ సెలక్షన్‌ టెస్ట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించినట్లు కరకగూడెం జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ రత్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఈ నెల 7తో ముగియాల్సిన దరఖాస్తుల గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అలాగే దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు www. navodaya. gov. in లేదా cbseitms. rcil. gov. in/ nvs వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

బుక్‌స్టాల్‌లో చోరీ

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్డులో ఉన్న ఓ బుక్‌స్టాల్‌లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఓ దుండగుడు ఇనుప రాడ్డుతో షట్టర్‌ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, కౌంటర్‌లో ఉన్న సుమారు రూ.15 వేల నగదును అపహరించాడు. శుక్రవారం ఉదయం యజమాని పాకాల శివ దుకాణానికి వచ్చి చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, బుక్‌స్టాల్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా, వాటి ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బస్సు అద్దాలు ధ్వంసం

అశ్వాపురం: మణుగూరులో బస్సు ఆపలేదని ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశాడు. కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మణుగూరు నుంచి కొత్తగూడెం వెళ్తోంది. మణుగూరులో బస్సు ఆపలేదని ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి మండలంలోని మొండికుంటలో బస్సుపై రాయి విసరగా అద్దాలు పగిలాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డ్రైవర్‌, కండక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement