గోదావరి వరద ముంపుపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

గోదావరి వరద ముంపుపై పట్టింపేది?

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

బూర్గంపాడు/భద్రాచలంఅర్బన్‌/దుమ్ముగూడెం: ఏటా గోదావరి వరద ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. వందలాది ఇళ్లు, వేలాది ఎకరాల పంటలు నీటమునుగుతున్నా.. పాలకులు పట్టించుకోవటం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌పాషా ఆరోపించారు. సీపీఐ ప్రజా చైతన్యయాత్ర శుక్రవారం సారపాక, భద్రాచలం, దుమ్ముగూడెం మీదుగా చర్ల మండలం తిప్పాపురంలో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో సాబీర్‌పాషా పాల్గొని ప్రసంగించారు. బూర్గంపాడు మండలంలో గోదావరి వరద ముంపు రాకుండా కరకట్టలు నిర్మించాలని, పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారులు దాడులు నిలిపివేయాలని కోరారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా దేవస్థాన భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, ఈ స్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమన్నారు. సీతారామ, సీతమ్మధార ప్రాజెక్టుల ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించిన తర్వాతే మిగులు జలాలను తరలించాలని, ప్రగల్లపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో గిరిజన గ్రామాలు, వ్యవసాయ భూములు, అడవులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాజేడు – భద్రాచలం ప్రధాన రహదారి ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిందని, మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములు, సహజ వనరులు, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వరరావు, మువ్వా వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మేయర్‌ గణేశ్‌, పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్‌, మున్నా లక్ష్మీకుమారి, పేరాల శ్రీని వాస్‌, సబ్కా నాగేశ్వరరావు, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం, తూర్పాకలో జయరామరెడ్డి స్తూపం, నరసాపురంలో రావులపల్లి నాగభూషణం స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజా చైతన్యయాత్రలో

సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement