అశ్వారావుపేటరూరల్: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు పొటెత్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 5వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘పెదవాగు నీళ్లు వృథా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎట్టకేలకు నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం మూడు గేట్లను కిందకు దించారు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు భారీగా గండ్లు పడిన సమయంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేయగా, నాటి నుంచి కిందకు దించలేదు. రింగ్ బండ్ నిర్మించి చేతులు దులుపుకున్న నీటి పారుదల శాఖ అధికారులు కనీసం గేట్లను కిందకు దించకుండా వదిలేయడంతో వరదనీరు గోదావరిలో కలుస్తోంది. తాజాగా గేట్లు దించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా లేకపోతే రింగ్‌బండ్ మళ్లీ కోతకు గురయ్యే అవకాశం ఉంది.


