చికిత్స పొందుతున్న వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వృద్ధుడి మృతి

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

ములకలపల్లి: మద్యానికి బానిసగా మారిన వృద్ధుడు పురుగులమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ మధుప్రసాద్‌ కథనం మేరకు.. మండలంలోని పాతూరు శివారు మేడువాయి గుంపులో వృద్ధ దంపతులు సున్నం బుల్లెమ్మ, సోములు జీవనం సాగిస్తున్నారు. సోములు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆయన మద్యానికి బానిసై పనులకు సరిగా వెళ్లడం లేదు. గురువారం మేకలు కాసేందుకు వెళ్లాలని కుటుంబీకులు చెప్పగా నిరాకరించాడు. తరచూ పనులు చెబుతున్నారని కోపంతో పురుగులమందు తాగాడు. కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోములు శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కేటీపీఎస్‌ క్రీడాకారుడు..

పాల్వంచ: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కేటీపీఎస్‌ జేఏఓ, క్రీడాకారుడు కొండ్ర అశోక్‌కుమార్‌ (43) మృతి చెందాడు. కేటీపీఎస్‌ 7వ దశ కర్మాగారంలో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఏడీఎం) అశోక్‌కుమార్‌ తాను నివాసం ఉండే కేటీపీఎస్‌ ఆస్పత్రి ఏరియాలోని క్వార్టర్‌లో గత నెల 23న బీపీ ఎక్కువై అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అతడిని కొత్తగూడెం ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య మీనా, కూతురు హనిక ఉన్నారు. అతడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా, అశోక్‌కుమార్‌ క్రీడల్లోనూ సత్తా చాటి తనదైన ము ద్ర వేసుకున్నాడు. ఆల్‌ ఇండియా హాకీ, ఫుట్‌బాల్‌ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించాడు. జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్స్‌ క్రీడల్లో హాకీ, ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, క్రికెట్‌ పోటీల్లో రాణించాడు. అతని మృతితో కేటీపీఎస్‌ కాంప్లెక్స్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని శనివారం కుటుంబ సభ్యులు పాల్వంచకు తీసుకురానున్నారు.

చికిత్స పొందుతున్న విద్యార్థి..

టేకులపల్లి: తండ్రి మందలించాడని గడ్డిమందు తాగిన డిగ్రీ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఘటన మండలంలోని కొప్పురాయి పంచాయతీ పరిధిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన గొగ్గిల రాములు కుమారుడు గొగ్గిల హనుమంతు (24) డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడంతో కొద్దిరోజులుగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చూసుకోవాలని తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హనుమంతు ఈ నెల 3న ఇంట్లోనే పురుగులమందు (గడ్డి మందు) తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం కన్నుమూశాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు బోడు ఏఎస్‌ఐ నాగయ్య కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement