అధికారుల అసహనం
● భద్రగిరిలో శిథిలాల తరలింపు ఆలస్యం ● అరకొర యంత్రాలతో నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియ ● పనులు వేగం పుంజుకోక అధికారుల అసహనం ● రాములోరి దర్శనంపై ప్రచార లోపం..
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనుల్లో శిథిలాల తొలగింపే పెనుభారంగా కనపడుతోంది. భవనాలు, ప్రాకారాలు కూల్చివేతలు జరుగుతున్నప్పటికీ వాటి శిథిలాల తొలగింపు మరింత ఆలస్యమవుతోంది. ఆలయ పనుల పరిశీలనకు వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురావు, జిల్లా కలెక్టర్ అంకిత్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు యంత్రాలను పెంచి రాత్రింబవళ్లు పనులు షిఫ్ట్‌ల వారీగా చేపట్టాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించటం లేదు. దీంతో నిర్దేశిత సమయంలో పనులు జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాళ్ల గుట్టల్లా శిథిలాలు
ఆలయ పునరుద్ధరణలో భాగంగా ఉపాలయాలు, ఇతర కట్టడాల కూల్చివేత పనులు జూన్ 27వ తేదీన ప్రారంభమయ్యాయి. తొలుత రంగనాయకుల గుట్ట పైన ఉన్న కుసుమ హరనాథబాబా, ప్రసాదాల తయారీ భవనం, ఆ తరువాత చిత్రకూట మండపం, దక్షిణం వైపు మెట్లు, గదులను కూల్చారు. ఉత్తరం దిక్కున ద్వారం, మెట్లను పడేశారు. ఆలయ ప్రాంగణంలో తాజాగా యాగశాల, భద్రుని గుడి లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, అద్దాల మండపాలను కూల్చారు. ఇలా మూడు పక్కల పనుల కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ వాటి తాలూకు రాళ్లు, ఇతరాల తొలగింపు మాత్రం ఆలస్యమవుతోంది. ముక్కోటి నాటికి నూతన ఉత్తర ద్వారం పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేయటంతో ఆ వైపు హడావుడిగా నిర్మాణ పనులను ప్రారంభించారు. ఐతే నెలరోజుల క్రితం కుసుమ హరనాథబాబ ఆలయం, వంటశాల వైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉండటం విశేషం. రాళ్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి.
ప్రచార లోపం, భక్తులకు ఇక్కట్లు
శిథిలాల తొలగింపు ఆలస్యమవుతుండటంతో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో సైతం పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కేవలం తూర్పు మెట్ల ద్వారానే దర్శనాలకు భక్తులకు అనుమతినిస్తున్నారు. దీనిపై అధికారులు తగిన ప్రచారం చేయకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. గోదావరి నుంచి పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తూర్పు మెట్ల వైపు రావడానికి తగు సూచిక బోర్డులు లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైకుల ద్వారా ప్రధాన కూడళ్లలో, ఆలయం చుట్టుపక్కల ప్రచారం చేయాలని పలువురు సూచిస్తున్నారు.
పనులను పరిశీలించిన ఈఓ
దేవస్థానం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురువారం ఆలయ ఈఓ దామోదర్‌రావు పరిశీలించారు. పడమర మెట్లను తొలగిస్తున్న నేపథ్యంలో తూర్పు వైపు కౌంటర్‌ల ఏర్పాటుకు వేస్తున్న షెడ్‌ను, ఉత్తరం, దక్షిణ భాగంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆయన వెంట దేవస్థానం ఈఈ రవీందర్, ఆలయ అధికారులు ఉన్నారు.
పనులు ఆలస్యంగా జరుగుతుండడంపై అధికారులు సదరు నిర్మాణ సంస్థ భాధ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యవధి తక్కువగా ఉండటం, పనులు నెమ్మదిగా జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరకొర యంత్రాలతో శిథిలాల తొలగింపునకే నెలలు పడుతోందని, ఈ ప్రకారం నిర్దేశిత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి కావని వారు చెబుతున్నారు. షిఫ్ట్‌ల వారీగా కార్మికులతో, రాత్రింబవళ్లు పనులు జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు పూర్తి కాకపోవడంతో పనుల పురోగతిపై తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తున్నారు.


