డీఈఓ వాసంతి
కొత్తగూడెంఅర్బన్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రీ ప్రైమరీ విద్య కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ప్రీ ప్రైమరీ శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో చిన్నారుల ఆసక్తిని పెంచేలా వినూత్నమైన యాక్టివిటిస్, నాణ్యమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, కృత్యధార బోధన పద్దతుల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కాగా ఇన్‌స్ట్రక్టర్లు తయారు చేసిన నమూనాలు, చార్టులు, డ్రాయింగ్‌లు, కాగితపు వస్తువులు, వినూత్న బోధన పరికరాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏఎంఓ మాధవరావు, ఆర్పీలు స్వరూప్‌కుమార్, శ్రీశైలం, ప్రవీణ్‌కుమార్, మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
క్యారమ్స్ పోటీలు
ప్రారంభం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండోర్ క్రీడలు–2026లో భాగంగా క్యారమ్స్ పోటీలను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి.ప్రేమలత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు పరస్పర స్నేహభావం, ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి గడదాసు నాగరాజు, కోశాధికారి జి.సంధ్యారాణి, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శులు బానోత్ దేవదాస్, ఎన్.ఉమ, గ్రంథాలయ కార్యదర్శి దొడ్డ ప్రసాద్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇంట్లోకి చొరబడి
విద్యార్థినిపై దాడి
బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని జగదీశ్‌కాలనీలో ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు మహిళలు ఇంట్లోకి చొరబడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జుట్టు పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కొట్టడంతో పాటు చంపేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాచలం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా లక్కవరం మోడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నెల 1న భద్రాచలంలోని తన నివాసంలో ఉంది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో బూర్గంపాడు మండలానికి చెందిన స్వరూప, పాల్వంచకు చెందిన రజిత(స్వరూప చెల్లి) ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, విద్యార్థినితో వాగ్వాదానికి దిగి, అసభ్య పదజాలంతో దూషిస్తూ జుట్టు పట్టుకుని ఇంటి నుంచి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో దాడి ఘటనను అడ్డుకునేందుకు వచ్చిన బాధితురాలి తల్లి, పెద్దమ్మ, సోదరుడినీ కూడా దూషించి బెదిరించి, చంపేస్తామని వారు హెచ్చరించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా, దాడి చేసిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం మార్కెట్‌కు
సెలవులు
ఖమ్మంవ్యవసాయం: వారాంతం, బోనాలు, అమావాస్య సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. ఈనెల 8వ తేదీ శనివారం, 9న ఆదివారం వారాంతపు సెలవులు కాగా, 10వ తేదీన సోమవారం బోనాల సందర్భంగా ప్రభుత్వం సెలవుప్రకటించింది. ఇక 11వ తేదీ మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు జరగనుండగా, 12వ తేదీ బుధవారం అమావాస్య కావడంతో సెలవు అమలవుతుంది. తిరిగి 13వ తేదీ గురువారం నుంచి మార్కెట్ యార్డులో కార్యకలాపాలు జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గమనించాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో సూచించారు.


