సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ/పాల్వంచరూరల్: మాతృ మరణాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ అంకిత్ ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన మాతృ మరణాలపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, 108 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. అనంతరం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యూనివర్సల్ న్యూ బోర్న్ బేబీస్ ఐ స్క్రీనింగ్ – ఆర్క్ లైట్ ఎగ్జామినేషన్’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవజాత శిశువులకు కంటి పరీక్షలు నిర్వహించి, పుట్టుకతో వచ్చే కంటి లోపాలకు చికిత్స అందించాలని సూచించారు. ఆర్క్ లైట్ పరికరం వినియోగం నిపుణులు అవగాహన కల్పించారు. ఆ తర్వాత భూ భారతి రిజిస్ట్రేషన్, సక్షేషన్ మాడ్యూళ్లపై నిర్వహించిన శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండాలని చెప్పారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనంత రామకృష్ణ భూ భారతి రిజిస్ట్రేషన్, సక్సేషన్ మాడ్యూళ్ల అమలు విధానం, పత్రాల పరిశీలన, భూ భారతి వ్యవస్థలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఇందిరమ్మ దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి, జగన్నాథపురం గ్రామాల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. ప్రతీ దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అనంతరం బస్వతారాకకాలనీలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాల నాణ్యతను పరిశీలించారు. ఆ తర్వాత పాల్వంచ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డులు, రక్త పరీక్ష సెంటర్, ఫార్మసీ, మందుల నిల్వ గదులను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ మధు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రాందాస్, డాక్టర్ దినేష్, పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ పి.రాజారావు, హౌసింగ్ పీడీ రామ్, ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు ఎన్.దిలీప్‌కుమార్, రాజేష్, సత్యేంద్రకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


