అవన్నీ మరిచారా?! | - | Sakshi
Sakshi News home page

అవన్నీ మరిచారా?!

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

జాగ్రత్తగా ముందుకు సాగితే..

రూ.600 కోట్లతో కొత్తగా ట్రాన్సిట్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ ఇందులో రూ.300 కోట్లు విదేశీ బ్యాంకు రుణమే మాస్టర్‌ప్లాన్‌, ‘కుడా’తో సంబంధం లేని కొత్త ప్రణాళిక

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి తొలి పాలకవర్గం తెరపైకి తీసుకొచ్చిన ట్రాన్సిట్‌ ఓరియెంటెండ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. నగర అభివృద్ధికి ఆయువు పట్టయిన మాస్టర్‌ ప్లాన్‌, ప్రణాళికాయుతమైన అభివృద్ధికి దిక్సూచి వంటి ‘కుడా’ భాగస్వామ్యం లేకుండా ప్లాన్‌ తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, రుణాల రూపంలో కాకుండా ప్రభుత్వ గ్రాంట్‌గానే పనులు చేపట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇప్పటికే డీపీఆర్‌ తయారీ టెండర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నందున భవిష్యత్‌లో చేపట్టే పనులైనా విమర్శలకు తావివ్వకుండా చేపట్టాలని నగరవాసులు సూచిస్తున్నారు.

ట్రాన్సిట్‌ ప్లాన్‌

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో కొత్తగూడెం – పాల్వంచ– సుజాతనగర్‌ గ్రోత్‌ కారిడార్‌ ప్రకటించడంతో అనూహ్యంగా ట్రాన్సిట్‌ ఓరియెంటెండ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ తెరపైకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు విదేశీ బ్యాంకు రుణంతో మొత్తంగా రూ.600 కోట్లతో నగర పరిధిలో అభివద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధమైంది. ఊహించనిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై ప్రజల నుంచి సానుకూలత వస్తున్నా, అభివృద్ధికి అప్పులతో లంకె పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అదే విధంగా నగర అభివృద్ధి ప్రణాళికలో కీలకమైన మాస్టర్‌ ప్లాన్‌, కుడా వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

కదలిక లేని మాస్టర్‌ ప్లాన్‌, ‘కుడా’

ఒక పట్టణం లేదా నగరంలో నివసించే ప్రజలకు అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆ నగర లేదా పట్టణం ఆదాయం పెరిగేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా అభివృద్ధి పనులు ప్రణాళికాయుతంగా చేపట్టేందుకు మాస్టర్‌ ప్లాన్‌ అవసరం. పక్కా మాస్టర్‌ ప్లాన్లు ఉన్న పట్టణాలు/నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. కొత్తగూడెం, పాల్వంచ వేర్వేరు మున్సిపాలిటీలుగా ఉన్నప్పటి నుంచి ఈ రెండు పట్టణాలకు మాస్టర్‌ ప్లాన్‌లు లేవు. ఈ రెండు పట్టణాలను ఒక్కటిగా చేసి, అందులో సుజాతనగర్‌ మండలంలో ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ గతేడాది మేలో కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. అంతకు ముందే 2024 అక్టోబర్‌ 28న కొత్తగూడెం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటి వరకు ‘కుడా’కు పాలకవర్గాన్ని నియమించలేదు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన విషయంలోనూ కదలిక లేదు. ట్రాన్సిట్‌ ప్లాన్‌ పట్టాలెక్కించే ముందు మాస్టర్‌ప్లాన్‌, ‘కుడా’పైనా కూడా కసరత్తు చేయాలని నగర వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

90వ దశకం తర్వాత కొత్తగూడెం, పాల్వంచలో అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. 2016లో కొత్తగూడెం జిల్లా కేంద్రమైన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాల వంటి నగరాలతో పోల్చితే అభివృద్ధి ఆశించిన వేగంతో లేదు. ఈ సమయాన ట్రాన్సిట్‌ ప్లాన్‌ను కార్పొరేషన్‌ తలకెత్తుకుంది. ఈ ట్రాన్సిట్‌ ప్లాన్‌ బడ్జెట్‌ రూ.600 కోట్లలో రూ.300 కోట్లు విదేశీ బ్యాంకు నుంచి రుణం రూపంలో సమీకరిస్తున్నారు. ఈ రుణానికి సాలీనా 13 శాతం వడ్డీరేటుతో ఏటా రూ.39 కోట్లు తిరిగి చెల్లించాలని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌కు అధిక ఆదాయం సమకూర్చే ప్రాపర్టీ ట్యాక్స్‌ ఏడాది సుమారు రూ.13 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం.. చేయబోయే అప్పులను బేరీజు వేసుకుని ట్రాన్సిట్‌ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లడం నగర భవిష్యత్‌కు మేలు చేస్తుంది. అభివృద్ధికి ఖర్చయే నిధులను అప్పు రూపంలో కాకుండా డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌), కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) వంటి ఇతర మార్గాల ద్వారా, ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో పొందేందుకు ప్రయత్నించాలని నగర వాసులు కోరుతున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌ మరిచి.. ట్రాన్సిట్‌ తెచ్చారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement