భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు.
ఉమ్మడి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ, 5జీ సేవలు
ఖమ్మంమయూరిసెంటర్: భారత్‌నెట్ ద్వారా తెలంగాణలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, మొబైల్ నెట్‌వర్క్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాలను వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పాలన, విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు టెలికాం మౌలిక వసతులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 356 గ్రామాలు మొబైల్ నెట్‌వర్క్ కలిగి ఉండగా, 355 గ్రామాలు 4జీ, 5జీ పరిధిలోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 361 గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ ఉండగా.. అందులో 357 గ్రామాల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
తల్లిపాలతో
శిశువుకు ఆరోగ్యం
‘లాక్టేషన్ యూనిట్’ను ప్రారంభించిన ఐటీడీఏ పీఓ
భద్రాచలంఅర్బన్: నవజాత శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలే ఉత్తమమైన ఆహారమని, ప్రతీ శిశువుకు తల్లి పాలు పట్టేలా వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ బాలింత శిశువుకు తల్లి పాలు మాత్రమే అందించేలా ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన యూనిట్ ద్వారా తల్లులకు పాలు ఇచ్చే విధానంపై కౌన్సెలింగ్, పాల సేకరణ, సురక్షితంగా భద్రపరచడం వంటి సేవలు అందుతాయని తెలిపారు. అలాగే, పాల నిల్వ గది, దుస్తులు మార్చుకునే గది ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, డీడబ్ల్యూఓ తెనినా, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఎంఓలు సంతోష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లిపాక పీఏసీఎస్‌లో
అక్రమాలు నిజమే...
రూ.22 లక్షలు పక్కదారి,
చైర్మన్, సీఈఓ నుంచి రికవరీకి ఆదేశాలు
అశ్వాపురం: మండలంలోని నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.22,07,441 మేర అవకతవకలు నిజమేనని నిర్ధారణ అయింది. ఆడిట్‌లో ఈ విషయాన్ని గుర్తించినట్లు జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. పీఏసీఎస్ పరిధిలో 2021–22లో అవకతవకలు జరిగాయని చైర్మన్, సీఈఓపై పాలకవర్గ బాధ్యులు డీసీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేయించగా నిధులు దుర్వినియోగం జరిగినట్టు తేలింది. ఈమేరకు నగదు రికవరీ కోసం డీసీఓ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని సెక్షన్ 60 ప్రకారం చైర్మన్, సస్పెన్షన్‌లో ఉన్న సీఈఓ నుంచి ఉమ్మడిగా రూ.20,30,122, సీఈఓ నుంచి రూ.1,77,319ను ఏటా 18శాతం వడ్డీతో వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


