పార్టీల నాయకులు సహకరించాలి
విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ
సమావేశంలో కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగంగా పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014 నుంచి 2026 జూలై వరకు నమోదైన 1,104 అట్రాసిటీ కేసులకు 859 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 12 కేసుల్లో శిక్షలు నమోదయ్యాయని తెలిపారు. కేసుల విచారణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధితులకు త్వరగా న్యాయం అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన 949 కేసుల్లో 823 కేసులకు పరిహారం మంజూరైందని, 105 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. గ్రామాలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ హక్కులు, పోక్సో చట్టం, మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్‌డీఓ మధు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌తో పాటు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పకడ్బందీగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడంతో సిబ్బందికి సహకారం అందించాలని తెలిపారు.కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9,96,198 మంది ఓటర్లకు సంబంధించి 8,60,051 ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మరో 1,29,263 ఫారాలు అందలేదని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రంగప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


