నమ్మకమే పెట్టుబడిగా...
● నగదు మోసపోయిన బాధితుల్లో ఆవేదన ● పెట్టుబడుల పేరిట మోసం విలువ రూ.52కోట్లు ● ఇప్పటి వరకు ఫిర్యాదు చేసింది ఇద్దరే..
భద్రాచలంఅర్బన్: నెలకు నాలుగు శాతం వడ్డీ... సురక్షిత పెట్టుబడి... కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం... ఇలా నమ్మకంగా చెప్పిన మాటలతో డబ్బు అప్పగించిన పలువురు ఇప్పుడు తాము మోసపోయామని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. భద్రాచలానికి చెందిన భరత్ రకరకాల పేర్లతో పలువురి నుంచి సుమారు రూ.52 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నా ఇప్పటివరకు పోలీసులకు ఇద్దరు మాత్రమే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే అధిక వడ్డీకి ఆశ పడినట్లు తెలిసి పరువు పోతుందని కొందరు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. మరికొందరు మాత్రం ఎప్పటికై నా డబ్బు తిరిగి వస్తుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల భరత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దసంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. అలాగే, భద్రాచలం రాజీవ్‌నగర్‌లోని ఇంటిని కూడా సీజ్ చేసినా బాధితులు పెద్దగా ముందుకు రాకపోవడం గమనార్హం.
చెల్లింపులు ఆగాక వెలుగులోకి...
కొంతకాలం తర్వాత భరత్ వడ్డీ చెల్లింపులు నిలిచివేయడమే కాక బిల్లులు రావాల్సి ఉందని, కాంట్రాక్ట్ చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని నమ్మబలికినట్లు తెలిసింది. నెలలు వేచి చూసినా ఫలితం లేకపోవడమే కాక భరత్, ఆయన కుటుంబీకులు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. కొందరు బాధితులు ఆయన ఇంటి వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి పోలీసులు విచారణ చేపట్టి కేరళలో భరత్‌ను అరెస్ట్ చేశారు.
ఏపీలోనూ బాధితులు
భరత్ పెట్టుబడుల సేకరణ వ్యవహారం భద్రాచలాన్ని దాటి ఏపీలోని చింతూరుకు చేరినట్లు సమాచారం. అయితే అక్కడి బాధితులు ఇప్పటికీ ఫిర్యాదు చేయకపోగా, డబ్బు తిరిగి వస్తుందనే భావనతో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులే చింతూరు సహా పరిసర ప్రాంతాల్లోనూ బాధితుల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు అప్పులు చేసి, మరికొందరు భూములు అమ్మి, బంగారం తాకట్టు పెట్టి భరత్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకకు చెందిన ఓ వ్యక్తి రూ.8.95 కోట్లు వడ్డీకి ఇవ్వగా విడతల వారీగా రూ.4.07 కోట్లు తిరిగి చెల్లించినా ఇంకా రూ.4.87 కోట్లు బాకీ ఉందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే, పాల్వంచ రూరల్ మండలం యానంబైల్‌కు ఓ మహిళ మూడేళ్ల క్రితం భరత్‌కు విడతల వారీగా రూ.1.46 కోట్లు ఇచ్చి లాభం చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్లగా తాళం ఉండడంతో పోలీసులను ఆశ్రయించింది. అలాగే, పాల్వంచ మండలంలోనే మరో 10 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం.
లావాదేవీలపై ఆరా
నిందితుడైన భరత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలు, చెక్కులు, డిజిటల్ రికార్డులు, ఆస్తుల కొనుగోళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తున్నారు. నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఒక భవనం, ఫ్లాట్‌ను ఇప్పటికే సీజ్ చేశారు. మరికొందరి బాధితుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ అనంతరం ఈ మోసం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
ఒకప్పుడు చిన్నస్థాయి లేబర్ కాంట్రాక్టర్‌గా ఉన్న భరత్ కాలక్రమేణా ఆర్థికంగా ఎదిగి ఖరీదైన ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులకు యజమానిగా మారాడు. విలాసవంతమైన జీవనశైలి, రాజకీయ, వ్యాపార వర్గాల్లో పరిచయాలతో నమ్మకమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది. అదే నమ్మకంతో మొదట బంధువులు, స్నేహితులు, వ్యాపార పరిచయాలున్న వారినే లక్ష్యంగా చేసుకొని పెట్టుబడులు సేకరించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఐటీసీ కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తా, నెలకు నాలుగు శాతం వడ్డీ వస్తుందని చెబుతూ ఆయన పెట్టుబడులు సేకరించినట్లు తెలిసింది. ప్రారంభంలో కొందరికి వడ్డీ సకాలంలో చెల్లించడంతో నమ్మకం పెరగగా ఇంకొందరు ముందుకొచ్చారు. అంతేకాక వారి స్నేహితులు, పరిచయస్తుల ద్వారా కూడా పెట్టుబడి పెట్టించగా రశీదులు, ఒప్పంద పత్రాలు ఇవ్వడంతో నమ్మకం బలిపడిందని తెలుస్తోంది.


