కరకగూడెం: రోడ్డుపై పడిపోయిన డీజిల్ క్యాన్ తీసుకునేందుకు బైక్ దిగిన ఆ యువకుడికి అదే చివరి క్షణమైంది. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ ఘటనకు సంబంధించి కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు తెలిపిన వివరాలు... మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కొమరం రాంగోపాల్(24) తన స్నేహితుడు పూనేం సందీప్‌తో కలిసి మంగళవారం అర్ధరాత్రి కరకగూడెం బంక్‌కు వెళ్లి క్యాన్‌లో డీజిల్ తీసుకుని బైక్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో డీజిల్ క్యాన్ కిందపడగా దానిని తీసుకునేందుకు బైక్ దిగాడు. అదే సమయాన వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రాంగోపాల్‌ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృతితో తల్లిదండ్రులు కొమరం సుబ్బారావు, లక్ష్మీభాయి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై రాంగోపాల్ సోదరుడు సురేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వేధింపుల కేసు నమోదు
భద్రాచలంఅర్బన్: భర్త, అత్తమామ వేధిస్తున్నారని వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భద్రాచలం టౌన్ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. అశోక్‌నగర్ కాలనీకి చెందిన మహేశ్వరి – సుధీర్‌బాబు 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోకవరంలో నివాసం ఉంటున్న భర్తతో పాటు అత్తమామ వేధిస్తున్నారని మహేశ్వరి ఫిర్యాదు చేయగా బుధవారం కేసు నమోదు చేశారు.
భూ వివాదంలో ముగ్గురిపై...
ములకలపల్లి: భూమిలోకి అక్రమంగా ప్రవేఽశించి, దున్నిన ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్నాథపురంకు చెందిన షేక్ మౌలానా భూమిలోకి గత నెల 31న అర్ధరాత్రి ముత్యాలంపాడు గ్రామానికి చెందిన కొందరు ప్రవేశించి దున్నారు. ఈమేరకు మౌలానా బుధవారం ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.
యువకుడిని బలితీసుకున్న వాహనం


