పాల్వంచ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు గురువారం నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్ పాషా తెలిపారు. పాల్వంచలోని చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో పాలకులు విఫలం కాగా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అంతేకాక పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, పంటలకు కనీస మద్దతు ధర లేక నష్టం ఎదురవుతోందని చెప్పారు. ఈ సమస్యలతో పాటు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్ల ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు, సీతారామ ప్రాజెక్ట్ పూర్తి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలను ప్రజలకు ఈ యాత్రలో వివరిస్తామని సాబీర్‌పాషా తెలిపారు. ఈసమావేశంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాధం, అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచందర్ రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా


