అశ్వాపురం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్ రాజీవ్ సాగర్ అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని బీజీ కొత్తూరు పంప్ హౌస్ సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించే మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి మోటార్లు అమర్చే ప్రక్రియను ఆయన మంగళవారం పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ చేపట్టిన రాజీవ్‌సాగర్ ప్రాజెక్‌న్టు రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్‌గా గత ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాజశేఖరరెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెంచిందని ఆరోపించారు. ప్రాజెక్ట్ పేర్లు మారినా రైతులకు నీళ్లు అందుతున్నాయంటే అంతా వైఎస్సార్ చలవేనని అన్నారు. మారెళ్లపాడు లిఫ్ట్ ఎడమ కాలువ ద్వారా 8 వేల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగు నీరు అందుతుందని వివరించారు. నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు శ్రీనివాస్, సూర్యప్రకాష్, ముత్యాలరావు, కాంగ్రెస్ నాయకుడు ఓరుగంటి రమేష్ పాల్గొన్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు


