మణుగూరు టౌన్/కరకగూడెం: వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అరోగ్యశాఖాధికారి తుకారాం రాథోడ్ సూచించారు. మంగళవారం శివలింగాపురం పీహెచ్‌సీని సందర్శించిన ఆయన ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కరకగూడెం, పినపాక, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ఆశా డే కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యాధికారులు రవితేజ, అనిల్, వేణు, సిబ్బంది నాగభూషణం, పోలెబోయిన కృష్ణయ్య పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
భద్రాచలంటౌన్: ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పీఓ బి.రాహుల్ పేర్కొన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల విజయవంతానికి అధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతి నిధులతో ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు డేవిడ్ రాజ్, విజయ్ కుమార్, శ్రీనివాస్, ఆదినారాయణ పాల్గొన్నారు.
హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహించాలి
బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ హెల్త్ ఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి సూచించారు. బూర్గంపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను, విద్యాబోధన తీరు, మధ్యాహ్న భోజనం అమలు తీరు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. హెచ్‌ఎం రవిలాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సైకిల్‌పై ఆధ్యాత్మిక యాత్ర
భద్రాచలంఅర్బన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లా బటవాపూర్ గ్రామానికి చెందిన హేమంత్ వత్స్ అనే వ్యక్తి సైకిల్‌పై ఆధ్యాత్మిక యాత్ర చేపట్టాడు. భద్రాచలం చేరుకున్న సందర్భంగా మంగళవారం ఇక్కడ వివరాలు వెల్లడించాడు. ఇప్పటివరకు సుమారు దేశవ్యాప్తంగా 67 వేల కిలోమీటర్ల దూరం సైకిల్‌పై ప్రయాణించినట్లు తెలిపాడు. 2023 జూలై 18న యాత్ర ప్రారంభించానని, అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నానని వివరించాడు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు. కరోనా సమయంలో తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయానని, ఆ విషాదం నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టానని వివరించాడు. యాత్రలో ఎవరైనా ఆహారం అందిస్తే స్వీకరిస్తానని, లేకపోతే స్వయంగా వండుకుంటానని చెప్పాడు. నేపాల్, శ్రీలంక దేశాల్లోని ఆలయాలను సందర్శించనున్నట్లు తెలిపాడు.


