● తుమ్మలచెరువులో బోటు షికారుకే పరిమితం ● కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు ● బోటింగ్‌కు వచ్చే వారికి కనీస సౌకర్యాలు కరువు
గత కలెక్టర్ హయాంలో..
గత కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ హయాంలో తుమ్మలచెరువు పర్యాటక అభివృద్ధిపై ప్రతిపాదనలు చేశారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ప్రత్యేకించి సందర్శించేలా బోట్ షికారుతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. పర్ణశాల, భద్రాచలం, సీతారామ, సీతమ్మసాగర్లను కలుపుతూ తుమ్మలచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. తుమ్మలచెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులు దృష్టి సారించాలని పర్యాటక అభివృద్ధి ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
సౌకర్యాలు ఏవి?
గత కలెక్టర్ ప్రతిపాదనల మేరకు తుమ్మలచెరువులో డబుల్ పెడల్ బోట్లు, స్కల్లింగ్ బోట్లు, ఫ్లోటింగ్ జెట్టి వంటివి తెప్పించారు. చుట్టుపక్కల మండలాల నుంచి వందలాది మంది వచ్చి బోటు షికారు చేస్తుంటారు. గతేడాది ముమ్మరంగా బోటు షికారు కొనసాగింది. నిర్వహణ బాధ్యతలను గ్రామంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. జిల్లాలోని యువతకు ప్రత్యేకమైన బోటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. అయితే, తుమ్మలచెరువు వద్ద బోటింగ్‌కు వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. బోటు కోసం వేచి ఉండే పర్యాటకులు నీడ లేక ఎండలో, వర్షంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బోటింగ్ వద్దకు రావడానికి తుమ్మలచెరువు వరకు సరైన రహదారి సౌకర్యం లేదు. ప్రాథమికంగా తుమ్మలచెరువుకు రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బోట్ షికారుకు వీలుగా చెరువు కట్టకు పలుచోట్ల మెట్ల నిర్మాణం, క్యాంటీన్, విశ్రాంతి కోసం హాలు, ఉద్యానవనం ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. బోటింగ్‌కు తగిన సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.
మండలంలోని కాకతీయులకాలంలో నిర్మించిన తుమ్మల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా తుమ్మలచెరువును పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదనలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. – అశ్వాపురం


