అశ్వారావుపేటరూరల్: బ్లాక్ మనీ, లాభాల పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బ్లాక్ పేపర్లు, లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకోగా అశ్వారావుపేటలోని సీఐ కార్యాలయంలో పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూ రు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రేమ్‌చంద్ ప్రస్తుతం అశ్వారావుపేట ఫైర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్లుగా జల్సాలకు అలవాటు పడిన ఆయన నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మిస్తున్నాడు. ఈక్రమాన అశ్వారావుపేటకు చెందిన వ్యాపారి మధుబాబును గతేడాది డిసెంబర్‌లో కలిసి తనకు రూ.15 లక్షలు ఇస్తే కొద్ది రోజుల్లోనే రూ.కోటి ఇస్తానని చెప్పాడు. ఇందులో భాగంగా బ్లాక్ పేపర్లను ద్రావణంలో ముంచితే అసలు కరెన్సీగా మారుతాయని (అసలైన నోట్లను వేళ్ల మధ్య దాచి తీస్తూ) నమ్మించాడు. ఆపై సదరు వ్యాపారి నుంచి తొలుత రూ.11లక్షలు, ఆతర్వాత ద్రావణం కొనుగోలుకు మరో రూ.2లక్షలు తీసుకుని ముఖం చాటేశాడు. నెలలు గడుస్తున్నా రూ.కోటి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి మంగళవారం ఫైర్ కాలనీలోని నివాసంలో ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన బ్లాక్ పేపర్ల కట్టలతోపాటు, రెండు లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితుడు ఇదే తరహాలో హైదరాబాద్‌లోని బాచుపల్లి, కూకట్‌పల్లి, రామచంద్రాపురం ప్రాంతాల్లో పలువురి మోసం చేయడమే కాక ద్విచక్రవాహనాల చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నాగరాజు రెడ్డి, ఎస్‌ఐలు టి.యయాతీ రాజు, దేవ్ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
బ్లాక్ పేపర్లు, లిక్విడ్ బాటిళ్లు స్వాధీనం


