మీకు ఆహ్లాదం.. | - | Sakshi
Sakshi News home page

మీకు ఆహ్లాదం..

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

పచ్చిగడ్డి, దాణా ఫీడింగ్‌కు నిధులివ్వని ప్రభుత్వం దత్తతకు ముందుకొస్తే...

సరిపడా దాణా అందక

బక్కచిక్కుతున్న జింకలు

ఫీడింగ్‌కు నిధులు కేటాయించని

రాష్ట్ర ప్రభుత్వం

కిన్నెరసాని డీర్‌ పార్కులో

160 చుక్కల దుప్పులు

దత్తత తీసుకుని దాణా అందించాలి

మాకు ఆకలి!

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో పర్యాటకులను అలరించే చుక్కల దుప్పులు(జింకలు) అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రాకపోవడంతో ఆహారం సరిపడా అందడంలేదు. అటవీశాఖ వైల్డ్‌లైఫ్‌ విభాగం అధికారులు ఉన్న నిధులతో నెట్టుకొస్తున్నారు. 1974లో సెప్టెంబర్‌ 29న ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో డీర్‌ పార్కు ఏర్పాటు చేశారు. 1999లో నిర్వహణనకు వైల్డ్‌లైఫ్‌ శాఖకు అప్పగించారు. పార్కు 14.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా, ప్రారంభంలో మూడు జింకలను వదిలారు. సంతానం పెరిగి ప్రస్తుతం 160 జింకలు ఉన్నాయి. వీటికి తోడు మరో మూడు మూషిక జింకలు, మరికొన్ని కొండ గొర్రెలు కూడా ఉన్నాయి. కిన్నెరసాని వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డీర్‌ పార్కులోని జింకలను వీక్షిస్తారు.

జింకల కోసం రెండు హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి పెంచుతున్నారు. అధికారులు పచ్చిగడ్డిపాటు ఫీడింగ్‌ను మేతగా వేస్తున్నారు. రోజూ ఉదయం 50 కేజీలు, సాయంత్రం 50 కేజీల ఫీడింగ్‌, 250 కేజీల గడ్డిని అందిస్తున్నట్లు వైల్డ్‌లైఫ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 11 రకాల పోషకాలు కలిగిన ఫీడింగ్‌ను ఛతీస్‌గఢ్‌లోని రాయచూర్‌ నుంచి తెప్పిస్తున్నారు. ఫీడింగ్‌తోపాటు పచ్చిగడ్డి వేసినా వాటికి సరిపోవడంలేదు. దీంతో పర్యాటకులు ఆహ్లాదం పంచే జింకలు బక్కచిక్కిపోతున్నాయి.

అదనంగా ఫీడింగ్‌ ఇవ్వాలంటే ఆర్థిక భారం పెరుగుతోంది. అటవీశాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు కూడా రావడంలేదు. వీక్షకులకు టికెట్లు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మునే ఇందుకు వినియోగిస్తున్నారు. పార్కులో 9 మంది వాచర్లకు, సీసీ కెమెరాల రీచార్జీలకు, శానిటేషన్‌, ఇతర నిర్వహణకు ప్రతీ నెల రూ.3 లక్షల వరకు ఖర్చవుతోందని అంచనా. ఇటీవల ఫీడింగ్‌ ధర కూడా పెరిగిపోయిందని వైల్డ్‌లైఫ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫీడింగ్‌ కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

కడుపు నిండా తిండిలేక బక్కచిక్కిపోతున్న జింకలను జంతు ప్రేమికులు, వితరణశీలురు, స్వచ్ఛంద సంస్థలవారు దత్తత తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పర్యాటకులకు ఆహ్లాదం పంచే దుప్పుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొంటున్నారు. మూగ జీవులకు మూడు పూటలా తిండి పెట్టే ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు.

వీక్షకులు అందించే ఆహారం కోసం ఎదురుచూస్తున్న వన్యప్రాణులు

దానశీలురు దత్తతైనా

తీసుకోండి

జింకల పోషణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు రావడంలేదు. పర్యాటకుల ద్వారా లభించే ఆదాయం ద్వారానే నెట్టుకొస్తున్నాం. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలని ఐటీసీ, నవభారత్‌, సింగరేణి, జెన్‌ సంస్థలను కోరాం. ఇంకా ఎవరూ ముందుకు రాలేదు. – బి.బాబు, వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement