భద్రాచలం: స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ (సీత) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు శిక్షణకు భద్రగిరి వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలిసారిగా ఈ శిక్షణ భద్రాచలంలో జరగనుంది. దేవాలయాల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. సీత సంస్థను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల పలువురు విన్నవించగా ఈ ఏడాది పునరుద్ధరించింది. డైరెక్టర్‌గా చిలకపాటి విజయరాఘవాచార్యులును నియమించి, గత నెలలో శిక్షణా కార్యక్రమాలను అధికారికంగా ప్రా రంభించింది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పనిచేసే 12 వేల మంది సిబ్బంది, అర్చకులు, అధికారులు, ట్రస్టు బోర్డు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగమ శాస్త్రాలు, దేవాలయ సంప్రదాయాలు, నిత్య పూజా విధానాలు, దేవాలయ పరిపాలన, ఆర్థిక నిర్వహణ, అకౌంట్స్, ఆస్తుల సంరక్షణ, భక్తులకు మెరుగైన సేవలు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, చట్టపరమైన నిబంధనలు, పారదర్శక పాలనపై శిక్షణలో వివరిస్తారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఈ నెల 5వ తేదీ నుంచి మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. 26 మంది శిక్షణలో పాల్గొననుండగా, దేవస్థానం తరఫున ఉచిత బస, భోజన వసతి కల్పించనున్నారు.
ఈ నెల 5వ తేదీ నుంచి
మూడు రోజులపాటు కార్యక్రమం


