పాల్వంచరూరల్: కిన్నెరసాని ప్రాజెక్ట్‌కు మరో 50 ఏళ్ల వరకు ఢోకాలేదని ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వ, సమర్థత పరిశీలన(సీడీఎస్‌ఈ) బృందం చైర్మన్ రామరాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సోమవారం సభ్యులు వెంకటరమణ, శ్రీకాంత్, లక్ష్మణ్‌రావుతో కలిసి ఆయన కిన్నెరసాని ప్రాజెక్ట్‌ను సందర్శించారు. నీటి నిల్వ సామర్థ్యం, పారిశ్రామిక, సాగు, తాగునీటి అవసరాలకు సరఫరాపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 175 ప్రాజెక్టులు ఉండగా, ఇప్పటివరకు 60 ప్రాజెక్టులను పరిశీలించామని తెలిపారు. 1962లో నిర్మించిన కిన్నెరసాని ప్రాజెక్ట్ చెక్కుచెదరలేదన్నారు. లోపాలు, జాగ్రత్తలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. గేట్ల లీకేజీల వంటి చిన్న సమస్యలు ఉన్నాయని అన్నారు. గేట్లు ఎత్తే క్రమంలో రోప్‌వేలు తెగినా లాక్ పడేలా స్పింగ్ బాల్స్ విధానంతో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేటీపీఎస్ విద్యుత్‌ను జెన్‌కో సంస్థ నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నందున, కేటీపీఎస్‌కు ఇక్కడి నుంచి నీరు వెళ్తుందని, ఈ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా గ్రిడ్‌పై ప్రభావం పడకుండా చూడాలన్నారు. కాగా బృందం మంగళవారం కూడా పరిశీలించనుంది. కేటీపీఎస్ ఎస్‌ఈ మొక్షవీర్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏడీఈ రామకృష్ణ, ఏఈ సురేష్ పాల్గొన్నారు.
సీడీఎస్‌ఈ బృందం చైర్మన్ రామరాజు


