● ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలూ నిర్వహించలేని దుస్థితి ● ప్రాభవం కోల్పోతున్న మండల పరిషత్‌లు ● స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

● ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలూ నిర్వహించలేని దుస్థితి ● ప్రాభవం కోల్పోతున్న మండల పరిషత్‌లు ● స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూపులు

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

● ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలూ నిర్వహించలేని దుస్థితి ● ప్రాభవం కోల్పోతున్న మండల పరిషత్‌లు ● స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూపులు

పట్టించుకోని ప్రభుత్వం

చుంచుపల్లి: గ్రామాల అభివృద్ధిలో కీలకమైన జిల్లా, మండల పరిషత్‌లు ప్రస్తుతం పాలకవర్గాల లేమి, నిధుల కొరతతో వాటి ప్రాభవం కోల్పోతున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా ఉన్న మండల పరిషత్‌లు ఇప్పుడు ప్రత్యేక అధికారుల పరిపాలనకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్‌లకు సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడంతో పాలన పూర్తిగా గాడి తప్పింది. రెండేళ్లుగా పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో స్థానిక పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. కనీసం మూడు నెలలకు ఒకసారి కూడా మండల పరిషత్‌ సాధారణ సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులపై సమీక్షలు తగ్గడం, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. మండల పరిషత్‌ పాలకవర్గాలు ఉంటే ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశాలను నిర్వహించి సమస్యలను ప్రస్తావించేవారు. ప్రజలకు కావాల్సిన అత్యవసర పనులు చేపట్టేందుకు తీర్మానాలు చేసివారు. కానీ, మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలకు సర్పంచులను ఎన్నుకోగా, వారు సైతం సమస్యలను ఎవరి వద్ద ప్రస్తావించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

రెండేళ్లుగా ఎన్నికలు లేవు..

జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు రెండేళ్లుగా ఎన్నికలను నిర్వహించకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే మూలుగుతున్నాయి. జిల్లా ప్రజా పరిషత్‌తోపాటు 21 మండల పరిషత్‌ల పాలకవర్గాలకు గడువు 2024 ఆగస్టు మొదటి వారంతో ముగిసింది. అప్పటి నుంచి పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది. గతేడాది డిసెంబర్‌లో గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరినా, మండల పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. ఈ పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమైనా కోర్టు ఆదేశాలతో బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. దీంతో పాలకవర్గాలు లేకపోవడంతో మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. సమస్యలను ఎవరికి చెప్పు కోవాలో తెలియడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒకరు చొప్పున ప్రత్యేకాధికారులను నియమించినా వారు ఎక్కడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ప్రత్యేకాధికారులు పనిభారం, ఇతర కారణాలతో మండల పాలనను పూర్తిగా పట్టించుకోవడం లేదు. తమ సొంత శాఖ విధులతోనే సరిపోతోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి మండల పరిషత్‌ పరిధిలో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామీణ రహదారులు, తాగునీటి పథకాల సమన్వయం వంటి బాధ్యతలు ఉంటాయి. గ్రామీణ రహదారుల మరమ్మతులు, తాగునీటి పథకాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మండల పరిషత్‌ సమావేశాలు క్రమం తప్పకుండా జరగాల్సి ఉన్నా, పాలకవర్గాలు లేకపోవడం వల్ల నిర్ణయాల ప్రక్రియ మందగిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగలేదు. దీంతో జిల్లా, మండల పరిషత్‌లలో పాలన అధ్వానంగా మారింది. ప్రత్యేక అధికారుల పాలనలో కనీసం సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించ లేకపోతున్నారు.

–బాదావత్‌ శాంతి, మాజీ ఎంపీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement