చండ్రుగొండ : మండలంలోని మద్దుకూరు గ్రామంలో జాతీయ రహదారిపై మలుపు వద్ద సోమవారం తెల్లవారుజామున బొగ్గు టిప్పర్ బోల్తా పడింది. జిల్లా పారిషత్ పాఠశాల గోడకు ఆనుకుని టిప్పర్ ఆగింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కాగా ఇదే ప్రాంతంలో అనేక సార్లు బొగ్గుటిప్పర్లతోపాటు జామాయిల్ లోడ్లతో వెళ్లే లారీలు సైతం బోల్తా పడ్డాయి. రెండేళ్ళకిత్రం ఓ పామాయిల్ లోడ్ లారీ అదుపుతప్పి పాఠశాల గదిలోకే దూసుకెళ్లింది. కాగా, మలుపు వద్ద రోడ్డు విస్తరించి, ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బాల కార్మికుల గుర్తింపు
భద్రాచలంఅర్బన్: ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా సోమవారం పట్టణంలో బాలల సంక్షేమ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. రెండు వాణిజ్య దుకాణాల్లె బాలలు పనులు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం బాలలను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చా రు. దుకాణం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.
చిరుత కాదు.. అడవి కుక్క
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని వచ్చిన వదంతుల్లో నిజం లేదని ఫారెస్ట్ సిబ్బంది సోమవారం తెలిపారు. అటవీ ప్రాంతంలో గేదెలపై దాడి చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో అటవీ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆనవాళ్లను పరిశీలించి, స్థానిక ప్రజల నుంచి వివరాలు సేకరించారు. కాలి గుర్తులు అడవి కుక్కవని, చిరుతపులి సంచరించినట్లు ఆధారాలు లేవని తెలిపారు.
గంజాయి స్వాధీనం
భద్రాచలంఅర్బన్: ఆర్టీసీ బస్సులో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు యువకులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని, ఠాణాకు తరలించిన విషమం విదితమే. ఇద్దరు యువకుల వద్ద ఆరు ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లు తేలగా, డీఎస్పీ అరుణ్‌కుమార్ సిబ్బందితో కలిసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు, గంజాయి తరలింపు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
రైలు కిందపడి
యువకుడు ఆత్మహత్య
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడు ఆర్వోబీ వద్ద ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన రామిశెట్టి వేణుకుమార్(21) వ్యక్తిగత కారణాలతో సోమవారం మధ్యాహ్నం సాయినగర్ – కాకినాడ వెళ్లే షిర్టీ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈమేరకు సమాచారం అందుకున్న జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఖమ్మం జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.


