ఇల్లెందు: పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. పని మనిషే నిందితురాలిగా తేలడంతో అరెస్ట్ చేశారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ వెంకన్నబాబు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాకతీయ నగర్‌లో పెద్దబోయిన శంకర్ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గత నెల 18న ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. మరుసటి రోజు అంత్యక్రియల సమయంలో తండ్రి చేయించిన బంగారు ఆభరాణాలను తల్లి మెడలో వేయాలని కుమారుడు, కుటుంబీకులు భావించారు. బీరువా తెరిచి చూడగా ఆభరణాలు కనిపించలేదు. అంత్యక్రియలు, సంస్మరణ కార్యక్రమాలు పూర్తయ్యాక గత నెల 30న మృతుడి కుమారుడు నగేష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి పనిమనిషి, కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వేమూరి సీతను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో చోరీ చేసినట్లు అంగీకరించింది. జూన్ 7న మధ్యాహ్నం ఇంటి యజమానులు నిద్రిస్తున్న సమయంలో బీరువా తెరిచి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపింది. గొలుసు ఇల్లెందులోని సీఎస్పీ బ్యాంకులో తాకట్టు పెట్టింది. మిగిలిన ఆభరణాలను సైతం ఖమ్మంలో విక్రయించేందుకు ప్రయత్నం చేసింది. విచారణ పూర్తి చేసిన పోలీసులు సుమారు 11 తులాలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ ఉమ పాల్గొన్నారు.
బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు


