సీతమ్మకు సుగమం! | - | Sakshi
Sakshi News home page

సీతమ్మకు సుగమం!

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

తొలగిపోతున్న అడ్డంకులు

తొలగనున్న సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు

మూడేళ్లుగా ఆగిన పనుల్లో కదలికకు అవకాశం

సవాల్‌గా మారనున్న పెరిగిన అంచనా వ్యయం?

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతమ్మ సాగర్‌ బరాజ్‌ నిర్మాణ పనులకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇప్పటికే టెక్నికల్‌ అప్రైజల్‌ కమిటీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బరాజ్‌ నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించాల్సి ఉంది.

అనుమతులు లేకుండా పనులు ప్రారంభం

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 6.50 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు గోదావరి జలాలు అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌)కు కేంద్రం నుంచి పర్యావరణ, ఇతర అనుమతులు రాకుండానే 2018లో నిర్మాణ పనులు మొదలుపెట్టింది. బరాజ్‌ను మినహాయించి మిగిలిన పంపుహౌస్‌లు, ప్రధాన కాలువ, టన్నెల్స్‌ తదితర పనులు 2022 నాటికి పూర్తయ్యాయి. ఆ తర్వాత గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో దుమ్ముగూడెం– అశ్వాపురం మధ్య పాత కాటన్‌ ఆనకట్టకు దిగువన 200 మీటర్ల దూరంలో సీతమ్మ సాగర్‌ బరాజ్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టింది.

ఎన్‌జీటీలో కేసు నమోదుతో ఆగిన పనులు

బరాజ్‌ ప్రతిపాదిత స్థలంలో నది వెడల్పు 1.50 కి.మీ. ఉండగా, ఇందులో కుడి వైపున 200 మీటర్ల మేరకు జల విద్యుత్‌ కేంద్రం కోసం కేటాయించారు. మిగిలిన 1.30 కి.మీ నదిని ఆరు బ్లాకులుగా విభజించారు. 2022లో నిర్మాణం ప్రారంభించారు. 2023 మే చివరి నాటికి ఒకటి నుంచి నాలుగు వరకు బ్లాకుల్లో పిల్లర్లు, స్పిల్‌వేల నిర్మాణం జరిగింది. ఐదు, ఆరు బ్లాకుల్లో క్రస్ట్‌ గేట్లు బిగించే స్థాయి వరకు పనులు పూర్తయ్యాయి. ఈ సమయంలో పర్యావరణ అనుమతులు రాకుండా బరాజ్‌ పనులు సాగుతున్నాయంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ, చైన్నె)లో కేసు నమోదైంది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేయాలంటూ ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. రూ.53 కోట్ల జరిమానా కూడా విధించింది.

నిర్మాణ అంచనా వ్యయం పెరిగే అవకాశం

సీతమ్మ సాగర్‌కు సంబంధించి బరాజ్‌, గైడ్‌వాల్స్‌, హెడ్‌ రెగ్యులేటరీ తదితర నిర్మాణాలను రూ.3,481 కోట్ల అంచనాలతో ప్రారంభించారు. మధ్యలో మూడేళ్లపాటు పనులు నిలిచిపోయాయి. దీంతో పనుల అంచనా వ్యయంలో భారీగా మార్పులు వచ్చినట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు కూడా జరగలేదు. మరోవైపు మూడేళ్లుగా ఎక్కడిపనులు అక్కడే ఆగిపోవడం వల్ల నిర్మాణ స్థలంలో నిలిపి ఉంచిన యంత్రాలు, నిర్మాణ సామగ్రి, వర్కింగ్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌ తదితర విషయాల్లోనూ కాంట్రాక్ట్‌ సంస్థ నష్టపోయినట్టు సమాచారం. వెరసి బరాజ్‌ నిర్మాణ పనులు మళ్లీ పట్టాలెక్కాలంటే ఆర్థికపరమైన అంశాలు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే సీతారామపై పెట్టిన వ్యయానికి వస్తున్న ప్రతిఫలంపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి భారీగా పెరగనున్న నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపైనే సీతమ్మ సాగర్‌ నిర్మాణ పనుల భవితవ్యం ఆధారపడి ఉంది.

పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టిన ప్రాజెక్టులపై ఉన్న నిషేధం నుంచి సీతమ్మ సాగర్‌ బరాజ్‌కు సుప్రీం కోర్టు బుధవారం మినహాయింపు ఇవ్వడం సానుకూల అంశం. దీంతో నిర్మాణ పనుల ఆరంభం నుంచి ఎదురైన అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇక నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విధించిన రూ.53 కోట్ల జరిమానా అంశం కొలిక్కి రావాల్సి ఉంది. ఎన్‌జీటీ నుంచి అనుమతి వస్తే సీతమ్మ సాగర్‌కు అడ్డుగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయి. వానలు, గోదావరిలో వరద తగ్గిన తర్వాత బరాజ్‌ నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే మరో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.

సీతమ్మ సాగర్‌ బరాజ్‌కు సుప్రీం కోర్టులో గ్రీన్‌ సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement