భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెనగడప
పీహెచ్‌సీలో తనిఖీ
చుంచుపల్లి: పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమై ఆరోగ్య సేవల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అధికారులు స్వర్ణలత, రమాదేవి, తోటమళ్ల ప్రతాప్, హరీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాల ఎత్తిపోత నిలిపివేత
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతను గురువారం రాత్రి నిలిపివేశారు. ఈ నెల 8న పంప్‌హౌస్ ఒక మోటారు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. 23 రోజులు పంప్‌హౌస్ ద్వారా సుమారు 3 టీఎంసీల నీరు విడుదల చేశారు. గోదావరికి గురువారం సాయంత్రం నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో ఎత్తిపోతలను నిలిపివేశారు.
అంకితభావంతో పనిచేయాలి
చుంచుపల్లి: అటవీశాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ సూచించారు. రామవరం రేంజ్ పరిధిలోని సత్యంపేట బీట్‌లో ఏర్పాటు చేసిన 15 హెక్టార్ల రైజింగ్ ప్లాంటేషన్‌ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాంటేషన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలన్నారు. రామవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
17లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1నుంచి 17వ తేదీ పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ సదానందం, ఓపెన్‌స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు సూచించారు. పదో తరగతి అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టులకు రూ.100చొప్పున ఇంటర్ అభ్యర్థులు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో ఆగస్టు 18నుంచి 24వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో ఆగస్టు 25నుంచి 29వ తేదీ వరకు, తత్కాల్ స్కీమ్ ద్వారా సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా పదో తరగతి అభ్యర్థులు రూ.500, ఇంటర్ అభ్యర్థులైతే రూ.వేయి ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు చెల్లించే అవకాశముందని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సెంటర్‌లో సంప్రదించి www. telanganaopenschool.org వెబ్‌సైట్‌లో లేదా టీఎస్ ఆన్‌లైన్ / మీ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని సూచించారు.


