గోదావరి దోబూచులాట | - | Sakshi
Sakshi News home page

గోదావరి దోబూచులాట

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

● నదీ ప్రవాహంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు ● రాత్రి 11 గంటలకు నీటిమట్టం 29 అడుగులుగా నమోదు

● నదీ ప్రవాహంలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు ● రాత్రి 11 గంటలకు నీటిమట్టం 29 అడుగులుగా నమోదు

భద్రాచలంటౌన్‌: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం గంటగంటకూ మారుతూ దోబూచులాడుతోంది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు 29 అడుగులకు చేరుకుని కొంతసమయం నిలకడగా ఉంది. అనంతరం తగ్గుముఖం పట్టి 27 అడుగులకు చేరింది. సాయంత్రం నుంచి మళ్లీ ప్రవాహం పెరుగుతోంది. రాత్రి 8 గంటలకు 28.70 అడుగులు, 11 గంటలకు 29 అడుగులుగా నీటిమట్టం నమోదైంది. బుధవారం రాత్రి కేవలం 17 అడుగులుగా ఉన్న నీటిమట్టం, గురువారం మధ్యాహ్ననికి 29 అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా భారీగా వరద వచ్చే అవకాశం ఉందని, శుక్రవారం ఉదయం వరకు 40 అడుగులకు పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల పరిస్థితిని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు గోదావరిలో ఆచరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలోకి ఎవరూ వెళ్లకుండా స్నానాల ఘాట్ల వద్ద తాళ్లు కట్టి రక్షణ చర్యలు చేపట్టారు. నదీ తీరంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

తాలిపేరుకు తగ్గిన

వరద ఉధృతి

చర్ల: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 99,915 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అదే స్థాయిలో దిగువన గోదావరి నదిలోకి వరదనీటిని విడుదల చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం ఆధారంగా ఉదయం 9 గంటలకు 71,455 క్యూసెక్కులను విడుదల చేసిన అధికారులు రాత్రి 8 గంటలకు 15 గేట్లను రెండేసి అడుగుల మేర ఎత్తి ఉంచి 17,664 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లుకాగా, నీటిమట్టాన్ని 72.26 మీటర్లుగా కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టు వద్ద 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

పెరుగుతున్న

కిన్నెరసాని నీటిమట్టం

పాల్వంచరూరల్‌: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుండటంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, గురువారం నీటిమట్టం 398.80 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాగా గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌ నీటిమట్టం 404.30 అడుగులు ఉన్నట్లు డ్యామ్‌ పర్యవేక్షణ ఇంజనీర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement