ఇసుక లారీలతో రహదారులు ధ్వంసం
రోడ్లు ఛిద్రం!
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి పుణ్యక్షేత్రంలోని రహదారులు గుంతలమయంగా మారాయి. భక్తులు, పట్టణవాసులు రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కేబుల్ తవ్వకాలతో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. పట్టణంలో కొద్ది నెలలుగా అండర్‌గ్రౌండ్ కేబుల్ లైన్ల ఏర్పాటు పనులు సాగుతున్నాయి. రహదారులను అడ్డదిడ్డంగా తవ్వి కేబుల్ పనులను పూర్తి చేసుకున్నారు. అనంతరం గుంతలను పూడ్చకుండా వదిలేశారు. కొన్ని చోట్ల నడుం లోతు గోతులు, మరికొన్ని చోట్ల మట్టి , రాళ్ల కుప్పలు దర్శనమిస్తున్నాయి. మూడు రోజుల క్రితం యూబీ రోడ్డులో ఓ వాహనం రాళ్ల కుప్ప వల్ల పక్కకు దూసుకురావడంతో ఓ దుకాణం అద్దాలు ధ్వంసమయ్యా యి. వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాగా, నిబంధనల ప్రకారం రోడ్ల డ్యామేజీ ఖర్చులను గ్రామపంచాయతీకి జమ చేయాలి. పంచాయతీ అనుమతితో రోడ్లను తవ్వి కేబుల్ పనులు పూర్తయ్యాక సదరు కాంట్రాక్టర్ గోతులను పూడ్చి వేయాలి. కానీ కాంట్రాక్టర్ ఇవేమీ పాటించడంలేదు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
కేబుల్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పనులు పూర్తయ్యాక రహదారుల పునరుద్ధరణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోతులను పూడ్చాలని ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా, పూడ్చనని చెబుతున్నాడని స్థానికులు, దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు.
మచ్చ తెస్తున్న అధికారుల తీరు
దేశ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భద్రాచలం తరలివస్తుండగా, వారికి గుంతలు స్వాగతం పలుకుతుండటంతో భద్రగిరి క్షేత్రానికి అప్రతిష్ట వస్తోంది. సదరు శాఖల అధికారుల తీరు కూడా మచ్చ తెస్తోంది. ప్రాణ నష్టం, ఇతర ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి కేబుల్ తవ్వకాల గుంతలను పూడ్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, ఇసుక లారీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గోదావరి నుంచి ఇసుక రవాణా చేసే భారీ లారీల రాకపోకలు ప్రధాన రహదారులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. చర్ల, దుమ్ముగూడెం మండలా ల్లోని ర్యాంపుల నుంచి రాత్రింబవళ్లు ఇసుక లారీలు భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. అధిక లోడ్‌తో ప్రయాణిస్తుండటంతో రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పట్టణ ప్రధాన రహదారులు, అంబేద్కర్ సెంటర్‌లో భారీ గోతులు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు కిందపడుతూ గాయాల పాలవుతున్నారు. వర్షం కురిసిన సమయంలో గుంతలు నీటితో నిండిపోవడంతో లోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.


