తొలిసారి సోయాబీన్..
కంది సాగుకు మొగ్గు
పెసర సాగు చేస్తున్నా..
ఖమ్మంవ్యవసాయం/ఇల్లెందు రూరల్: ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. జలాశయాల్లోకి నీరు చేరకపోగా.. భూగర్భ జలాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వరికి బదులు ఇతర పంటలు ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే, వినూత్న పంటల సాగులో ముందు నిలిచే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు పలువురు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవడంలోనూ ఓ అడుగు ముందే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, పత్తి ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు ప్రధాన నీటి వనరు సాగర్ ప్రాజెక్టు నుంచి ఈసారి నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. బావులు, బోర్ల ఆధారంగా వరి సాగు చేసినా కీలకమైన సమయాన ఇబ్బంది అవుతుందనే ఆలోచన రైతుల్లో నెలకొంది. దీంతో పలువురు ‘ప్రత్యామ్నాయ’ బాట పట్టారు.
చెరకుకు చెక్
చెరకు సాగుకు నీటి వినియోగం ఎక్కువ. ప్రస్తుతం ఆ పంటను సాగు చేస్తే ఇబ్బంది వస్తుందని భావించిన ఏన్కూరు మండలం హిమామ్‌నగర్‌కు చెందిన కల్యాణ్ క్యాబేజీ ఎంచుకున్నారు. ఆరెకరాలకు గాను ఇప్పటికే మూడెకరాల్లో ఆయిల్‌పామ్ నాటాడు. మిగిలిన భూమిలో వరికి బదులు క్యాబేజీ సాగు చేస్తున్నాడు. దీని పంట కాలం రెండు నెలలె కాగా నీటి తడులు తక్కువగా అవసరమవుతాయి. ఆ నీరు కూడా డ్రిప్‌తో అందిస్తున్నాడు.
ఆరుతడితోనే అధిక లాభాలు
ఆరుతడి పంటలకు నీటి అవసరం అంతగా ఉండకపోగా పెట్టుబడీ తక్కువే. కేవలం 90 రోజుల్లోనే పంటలు చేతికందుతాయి. ఎకరా విస్తీర్ణంలో కంది సాగుకు రూ.5వేలకు మించి ఖర్చు ఉండదు. ఎకరానికి 8 – 10 క్వింటాళ్లు దిగుబడి వస్తే క్వింటాకు రూ.6,500 వరకు ధర పలుకుతుంది. సోయాబీన్ యూరియా అవసరం లేని పంట. సాగు కాలం మొత్తంలో డీఏపీ, 20–20 ఒక్కో కట్టను ఎకరం విస్తీర్ణంలో మొక్కలకు అందించాలి. మొత్తంగా ఎకరానికి రూ.10వేల నుంచి 12వేల వరకు ఖర్చు చేస్తే.. 8 – 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ.8వేల ధర పలుకుతుంది. నువ్వు సాగు ఎకరాకు మొత్తంగా రూ.5వేల నుంచి 6వేలకు మించి ఖర్చు ఉండదు. దిగుబడి ఎకరానికి 2 – 3 క్వింటాళ్లు కాగా ధర క్వింటా రూ.25వేల ఉంటుంది.
ఇప్పటివరకు వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలే సాగు చేశాను. వర్షపాతం తక్కువగా ఉంటుందన్న అధికారుల హెచ్చరికలు ఆలోచింపజేశాయి. తొలిసారి సోయాబీన్ నాలుగెకరాల్లో సాగు చేస్తున్నా. మొక్కలు మంచిగా ఎదుగుతున్నాయి.
– సలీం, మొండితోగు, ఇల్లెందు మండలం
మార్కెట్‌లో మంచి ధర ఉండడం, తక్కువ పెట్టుబడి, నీటి తడులే అవసరం కావడంతో కంది వైపు మొగ్గుచూపా. ఇప్పటివరకు వరి, మొక్కజొన్న వేయగా, ఈ సారి నాలుగెకరాల్లో కంది సాగు ప్రారంభించాను. పంట ఆశాజనకంగా ఉంది.
– లకన్‌లాల్‌పాసి, పూసపల్లి,
ఇల్లెందు మండలం
ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏటా వ్యవసాయం చేస్తుంటాను. ఇప్పటివరకు వరి, మొక్కజొన్న పంటలకే ప్రాధాన్యమిచ్చాను. ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేయాలనే భావనతో ఈసారి ఐదెకరాల్లో పెసర సాగు ప్రారంభించాను.
– అజ్మీరా మోహన్, మస్సివాగు,
ఇల్లెందు మండలం


