పాల్వంచ: గిరిజన హక్కుల సాధనకు, ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు ఉద్యమించాలని అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్‌చార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నీరాజా సూచించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం రెండో రోజు జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య(టీజీఎస్) రాష్ట్ర మహాసభల్లో మాట్లాడారు. పాలకులు గిరిజన ప్రాంతాల్లో హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. తరతరాలుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న గిరిజన బిడ్డలను భూములకు దూరం చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పోడు సాగుదారులపై దాడులు, నిర్బాంధాలను అడ్డుకుంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అడవిపై సర్వహక్కులు గిరిజనులవేనని అన్నారు. టీజీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామ్మూర్తి నాయక్, అంజయ్య నాయక్ మాట్లాడుతూ గిరిజన సమాఖ్య బలోపేతం ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పోడు భూముల పట్టాల పంపిణీని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వి.పూర్ణచందర్ రావు, అడుసుమిల్లి సాయిబాబా, దశ్రు, రాహుల్, శ్రీనివాస్, కుటుంబరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి అన్నీరాజా


