మొక్కుబడిగా ఏర్పాట్లు
అనుమతులు సాధించి సకాలంలో సీతారామ పనులు పూర్తి చేస్తాం
ప్రాజెక్ట్ సందర్శనలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జలయజ్ఞంలో చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌లను రీడిజైనింగ్ పేరుతో అర్ధంతరంగా ఆపేయడంతో ఆర్థిక భారం పెరగడమే కాకుండా ఆశించిన ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇప్పటికీ దక్కలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద కాటన్ ఆనకట్ట, సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణ స్థలాలను ఆయన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో రూ.3,505 కోట్లతో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా రాజీవ్‌సాగర్, ఇందిసాగర్ ప్రాజెక్ట్‌లు చేపడితే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో వాటిని రద్దు చేసిందని ఆరోపించారు. ఆ స్థానంలో సీతారామ ప్రాజెక్ట్‌ను చేపట్టి, రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని, అయినా ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు రాలేదని విమర్శించారు.
ఖమ్మంపై పగబట్టారు
వరుసగా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు గాను బీఆర్‌ఎస్ ఒక్కో సీటే గెలిచిందని, ఈ విషయాన్ని కడుపులో పెట్టుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి విమర్శించారు. అందుకు సీతారామ ప్రాజెక్టే ఉదాహరణ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని, అందులో భాగంగా రాజీవ్ లింక్ కెనాల్‌ను నిర్మించామన్నారు. దీంతో 1.25 లక్షల ఎకరాల కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలతో భరోసా ఏర్పడిందన్నారు.
అనుమతులు తెస్తాం
ఎలాంటి అనుమతులు లేకుండా సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టి వేల కోట్ల రూపాయలు దండగ చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అనుమతులు సాధిస్తున్నామని, పర్యావరణ అనుమతుల కోసం సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామన్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాకే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో లష్కర్లు మొదలు ఇంజనీర్ల వరకు ఖాళీలను భర్తీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు, ప్రమోషన్లు లేవని, ఇరిగేషన్ శాఖలో జవాబుదారీతనం లోపించిందని విమర్శించారు.
సుడిగాలి పర్యటన
షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:15 గంటలకు మణుగూరులో హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సిన మంత్రుల బృందం గంట ఆలస్యంగా 11:13 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కాటన్ ఆనకట్ట వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. గోదావరి నుంచి నీటిని తీసుకునే బెల్‌మౌత్ ప్రదేశాన్ని పరిశీలించారు. సాంకేతిక అంశాలపై ఇంజనీర్లతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటలకు బీజీకొత్తూరు పంప్‌హౌస్, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:56 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాతాలకుంట టన్నెల్ పరిశీలనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో పినపాక, మణుగూరు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.
మంత్రుల పర్యటనకు సాగునీటి శాఖ అధికారులు మొక్కుబడిగా ఏర్పాట్లు చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో కాటన్ ఆనకట్ట నుంచి గోదావరి నీటిని ఎలా సమర్థంగా వినియోగిస్తారు, ప్రాజెక్టులో వివిధ ప్యాకేజీల పనుల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలనే అంశాలపై సాంకేతిక అంశాలతో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందిస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. సీతారామ పాత ఇంజనీరింగ్ డ్రాయింగుల ప్రదర్శనకే అధికారులు పరిమితమయ్యారు. దీంతో ఇరిగేషన్ మంత్రి సైతం సీతారామ ప్రాజెక్టు కంటే కాళేశ్వరం, దేవాదుల, తుమ్మిడిహెట్టి వంటి ఇతర ప్రాజెక్టుల గురించే ఎక్కువగా మాట్లాడటం ఇరిగేషన్‌శాఖ వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. అధికారుల వైఫల్యం కారణంగా కనీసం సీతమ్మ సాగర్ బరాజ్ గురించి కనీస స్థాయిలో చర్చ జరగలేదు. మిగిలిన మంత్రులు కూడా సాంకేతిక అంశాల కంటే రాజకీయ అంశాలపైనే ఎక్కువగా మాట్లాడారు.
ఓట్ల రాజకీయం కోసం బీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసింది


