● టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ● విద్యుత్ మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం
భద్రాచలంఅర్బన్/మణుగూరు రూరల్ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన మణుగూరులోని 33/11 కేవీ సబ్ స్టేషన్, సబ్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. విద్యుత్ సేవలపై సమీక్ష నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మణుగూరు ఏరియాలోని పీకేఓసీ గనిని సింగరేణి అధికారులతో కలిసి సందర్శించారు. విద్యుత్ సంబంధిత అంశాలపై ఆయన సింగరేణి అధికారులతో చర్చించారు. భద్రాచలం డివిజనల్ కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు. సుమారు రూ.8.5లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అధిక లోడ్‌తో సమస్య ఏర్పడితే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా చేయవచ్చని అన్నారు. అనంతరం సమస్యలపై ట్రేడ్ యూనియన్ నాయకులు సీఎండీకి వినతిపత్రం ఇచ్చారు. కాగా, తొలుత సీఎండీ అధికారులు మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఈ జి.మహేందర్, అధికారుల జీవన్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, నరసింహారావు, వేణు, ఏఈలు, ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


