కల్యాణానికి చోటేది? | - | Sakshi
Sakshi News home page

కల్యాణానికి చోటేది?

Jul 17 2026 12:41 AM | Updated on Jul 17 2026 12:41 AM

కల్యాణాలపై పునరాలోచిస్తాం

చిత్రకూట మండపం శ్లాబ్‌కు డ్రిల్లింగ్‌ ప్రారంభం

భద్రగిరిలో కల్యాణ వేదిక నిర్మించాలని భక్తుల సూచనలు

వాహన పూజలకు ప్రత్యేక స్థలంలేక వాహనదారులకు అవస్థ

ఈ రెండింటికి పునరుద్ధరణ పనుల్లో అవకాశం కల్పించాలని విన్నపం

భద్రాచలం: ఆదర్శ జంటగా నిలుస్తున్న సీతారాములు కొలువైన భద్రగిరిలో పలువురు వివాహం జరుపుకోవాలని ఆశపడుతుంటారు. కానీ దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణ వేదికే లేదు. ఆలయం తరఫున కనీసం సహాయ సహకారాలు అందించే పరిస్థితి కూడా లేదు. దీంతో భక్తులు నిరుత్సాపడుతున్నారు. ప్రసిద్ధ ఆలయాలైన తిరుపతి, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి క్షేత్రాలు నిత్యం కల్యాణాలతో సందడిగా ఉంటున్నాయి. భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ పరిధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఉపాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కల్యాణాలకు అనుమతిస్తున్నారు. దేవస్థానానికి విరాళం ఇస్తే ఈ అవకాశం కల్పిస్తున్నారు. విరాళంతో రశీదు ఇస్తున్నా అధికార పత్రంగా ఉపయోగపడదు. వధూవరులు వివాహ రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే వివాహ ఆహ్వాన పత్రం, కల్యాణంలోని కొన్ని ఫొటోలు సమర్పించాల్సిందే. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, చాలా ఏళ్ల క్రితమే అనుమతి ఇచ్చామని, మైనర్ల కల్యాణం, ఇతక అనైతిక వివాహాలకు బాధ్యత వహించాల్సి రావడంతో అధికారిక కల్యాణాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని..

భద్రగిరికి భక్తుల రాక పెరగడంతోపాటు భద్రాచలంలో కల్యాణం జరపాలనే ఆసక్తి పలువురిలో పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తే ఆలయానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు సులభ పద్ధతిలో వివాహ రుజువు పత్రాలు అందేలా చొరవ తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు సాగుతున్న వేళ కల్యాణాలకు దేవస్థానం ఆధ్వర్యంలో వేదిక నిర్మించి అద్దెకు ఇవ్వాలని కోరుతున్నారు. దీన్ని కూడా ఆలయ పునరుద్ధరణ ప్రణాళిక చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. నూతనంగా వాహనాల పూజలకు కూడా దేవస్థానం పరిధిలో సరైన స్థలమే లేదు.

రామయ్య సన్నిధిలో కల్యాణాలకు అనుమతిస్తున్నాం. దేవస్థానం తరఫున ధ్రువీకరణ పత్రం మాత్రం ఇవ్వటం లేదు. గతంలో లీగల్‌గా సమస్యలు రావడంతో పత్రాలు ఇవ్వడం నిలిపివేశాం. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మళ్లీ ప్రతిపాదనలు పంపుతాం. వాహన పూజలు, గోశాల పూజలపై కూడా నిర్ణయం తీసుకుంటాం.

–కె.దామోదర్‌రావు, ఈఓ, రామాలయం

కనుల పండువగా రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం చిత్రకూట మండపం శ్లాబుకు డ్రిల్లింగ్‌ చేశారు. మండపంలో ఉన్న పిల్లర్లు, శిల్పకళారాళ్లను పూర్తి స్థాయి రక్షణలో తొలగించాల్సి ఉండటంతో ఆలస్యమవుతోంది. దీంతో శ్లాబ్‌ పడగొట్టేందుకు యంత్రాలను ఉపయోగించకుండా కార్మికులతోనే డ్రిల్లింగ్‌ చేయిస్తున్నారు. సుమారు వారం రోజుల్లో శ్లాబ్‌ తొలగింపు పూర్తవుతుందని, అనంతరం పిల్లర్లు, ఇతర కళాత్మక సామగ్రిని పదిలంగా భద్రపర్చుతామని చెబుతున్నారు. మార్కింగ్‌ పనులు గురువారం కూడా కొనసాగాయి. కాగా, ఆలయంలో 21 వైదిక పోస్టుల భర్తీకి సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు అందజేయనున్నారు. దేవాదాయ శాఖ సమాచారంతో ఎంపికై న అభ్యర్థులంతా నేడు హైదరాబాద్‌ వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement