కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): వానాకాలం వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. వానాకాలం పంటల సాగు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు, తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రైతు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఇతర అధికారులు నాగలక్ష్మి, బాబూరావు, తుకారాం రాథోడ్, అనూష, వాసంతి, తిరుమలేష్, నళిని తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు
మెడికల్ బోర్డు
రుద్రంపూర్: సింగరేణి యాజమాన్యం ఈ నెల 17, 18వ తేదీల్లో మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించనుంది. సంస్థ గతేడాది మార్చి 23న చివరిసారిగా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో మెడికల్ బోర్డ్ నిర్వహించింది. 17 నెలల తర్వాత మళ్లీ ఈ నెల 17న ప్రీ బోర్డ్, 18న కార్పొరేట్ బోర్డ్ నిర్వహించనుంది. ఈ మేరకు కార్మికులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా, మెడికల్ బోర్డు నిలిచిపోవటంతో సుమారు 3 వేల మంది కార్మికుల భవితవ్యం సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఆందోళన, రాజకీయ పార్టీల డిమాండ్‌తో సంస్థలో కదలిక వచ్చింది.
టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి
కొత్తగూడెంఅర్బన్: గత జనవరి నెలలో జరిగిన టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్లు డీఈఓ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాల్ టికెట్/ఆధార్ కార్డు తీసుకుని వచ్చి మార్కుల జాబితా పత్రాలను తీసుకెళ్లాలని సూచించారు. వివరాలకు 89192 79238 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపర్చాలి
పాల్వంచ: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి అన్నారు. కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్.మాధవరావు, టి.మాధవరావు, కోటేశ్వరరావు, కమలాకర్, జయబాబు పాల్గొన్నారు.
జవహర్ నవోదయకు దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు ఈ నెల 31వ తేదీ వరకు ఉందని, ప్రవేశ పరీక్ష నవంబర్ 28న జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.
మిగిలిన సీట్ల భర్తీకి
రేపు కౌన్సెలింగ్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి శనివారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 18న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ మొదలవుతుందని ప్రాంతీయ సమన్వయకర్త సీహెచ్.రాంబాబు తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్‌తోపాటు ఇతర పత్రాలతో రఘునాథపాలెంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్(బాలుర)కు హాజరుకావాలని సూచించారు.


