అశ్వాపురం: మండల కేంద్రంలోని భారజల కర్మాగారం అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయమైన గౌతమీనగర్ కాలనీలో గురువారం జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు యాత్రను మణుగూరు భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు ప్రారంభించగా, వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం పూరీలో జరిగే జగన్నాథ రథయాత్రకు అనుసంధానంగా ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. భారజల కర్మాగారంలోని ఒడిశాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో ఏర్పడిన ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు తొలిరోజు ఆధ్యాపూజ, మధ్యాహ్నపూజ, పహాండి, ఛెరపహారా తదితర కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం పురవీధుల్లో దేవతా మూర్తులను ప్రత్యేక పల్లకీల్లో ఊరేగించారు. భక్తులు మేళతాళాలు, కోలాటాలు, ఒడిశా సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒడిశా వాసులతో పాటు వివిధ రాష్ట్రాల భక్తులు ఇరువైపులా పెద్ద సంఖ్యలో బారులుదీరి భక్తి పారవశ్యంతో జగన్నాథుని నామస్మరణతో రథం లాగారు. అనంతరం గుండిచాఘర్ మందిరంలో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వేడుకలు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారజల కర్మాగారం అధికారులు, ఉద్యోగులు, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గౌతమీనగర్ కాలనీలో భక్తుల సందడి


