
ఆదివాసీ జాతికి అండగా ఉంటా
కుమురం భీం విగ్రహ ఆవిష్కరణలో
మంత్రి ధనసరి సీతక్క
మణుగూరు టౌన్: ఆదివాసీ జాతికి అండగా ఉంటానని, అలాగని తాము ఎవరికీ వ్యతిరేకం కాదని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మణుగూరు బీటీపీఎస్ వద్ద బీటీపీఎస్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మల దయతోనే తనకు మంత్రిగా పని చేసే అవకాశం లభించిందన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందే విషయంలో లోపాలుంటే తెలపాలని, వాటిని సరిచేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఆదివాసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కుమురం భీం విగ్రహాలను ఆవిష్కరిస్తామని చెప్పారు. పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం, ఇరిగేషన్ మంత్రిని కలుస్తానని తెలిపారు. మేడారం జాతరకు ఈసారి రూ.150 కోట్లు నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు రూ.12.50 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు.
అయోధ్యకు నివాళి
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు అయోధ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. రామానుజవరంలోని వారి నివాసంలో అయోధ్య చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఆదివాసీ సంఘాలు, కాంగ్రెస్ రమణ, లక్ష్మయ్య, వట్టం ఉపేందర్, చందా సంతోష్, వట్టం నారాయణ, వాసం రామకృష్ణ, బట్టా విజయ్ గాంధీ, పి.నవీన్, శివసైదులు, సయ్యద్ ఇక్బాల్ హు స్సేన్, గొడిశాల రామనాధం, ఆవుల సర్వేశ్వరరావు, సౌజన్య, కేశవరావు, రహీంపాషా పాల్గొన్నారు.