
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
చండ్రుగొండ : మండలంలోని బెండాలపాడులో ఈ నెల 21న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం లబ్ధిదారులను కలిసి సూచించారు. 40 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాట్లపై పోలీస్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్ అధికారులు సైతం బెండాలపాడు గ్రామాన్ని సందర్శించి సీఎం భద్రతపై సమీక్షించారు. అనంతరం దామరచర్లలో పది ఎకరాల్లో నిర్వహించతలపెట్టిన సభ ప్రాంగణాన్ని, చండ్రుగొండలో ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్, రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఓఎస్‌డీ నరేందర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ వెంకన్నబాబు, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, గృహనిర్మాణశాఖ పీడీ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.