
మొదటి హెచ్చరిక దిశగా..
● మున్నేటికి కాల్వొడ్డు వద్ద 15అడుగుల నీటిమట్టం ● ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద మున్నేటికి పోటెత్తింది. ఈ ఏడాది తొలిసారి కాల్వొడ్డు వద్ద 15అడుగులకు పైగా వరద ప్రవహించింది. శనివా రం ఉదయం 9.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ సాయంత్రం 6గంటలకు 15 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ నీటిమట్టం 16అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
అధికారుల పరిశీలన
మున్నేటికి వరద ఉధృతి పెరుగుతుండడంతో మధ్యాహ్నం 12గంటల సమయాన కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య కాల్వొడ్డు వద్ద పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రత్యేక అధికా రులు, వార్డు ఆఫీసర్లు స్థానికంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చారు. సాయంత్రం 4.30గంటలకు నీటిమట్టం 14.5 అడుగులకు చేరగా లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లేలా విలువైన వస్తువులు భద్రపరుచుకోవాలని ప్రచారం చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఏదులాపురం మున్సి పల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి మున్నేటికి ఇరువైపులా పరిశీలించి కార్పొరేటర్లు, ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు రాగానే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వరద పెరుగుతున్న నేపథ్యాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు చేశారు. అలాగే, అలాగే, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో అన్ని శాఖల అధికా రులు మున్నేటి పరీవాహకంలో పర్యవేక్షించారు. కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్, ఎస్‌ఈ, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లే కాక అర్బన్, రూరల్ తహసీల్దార్లు, త్రీటౌన్ సీఐ, ఇరిగేషన్ అధికారులు ముంపు ప్రాంతాల్లో కలియదిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. కార్పొరేటర్లు తోట గోవిందమ్మ రామారావు తదితరులు కూడా అధికారుల సూచనలు పాటించాలని, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందుగానే అప్రమత్తం కావాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
పునరావాస కేంద్రాలు సిద్ధం..
శనివారం రాత్రి మున్నేటి వరద 17అడుగుల వరకు చేరే అవకాశముందన్న సమాచారంతో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదే సమయాన పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ప్రజలను తరలించాల్సి వస్తే అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తొలిదఫా నయాబజార్ జూనియర్ కళాశాల, రామన్నపేట స్కూళ్లలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ఉంచారు.