
ఆర్‌అండ్‌బీ రహదారిపై రోడ్లు వేసి నిరసన
బూర్గంపాడు: మండలంలోని సారపాక నుంచి ఇరవెండి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి దెబ్బతిని గుంతలు తేలగా.. వర్షానికి నీరు నిలిచి స్థానికులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈమేరకు సీపీఎం ఆధ్వర్యంలో శనివారం రహదారిపై గుంతల్లో నిలిచిన నీటిలో నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతు రహదారి సమస్యను ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇకనైనా కనీస మరమ్మతులు చేయించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాపినేని సరోజని, ఎస్కే అబీదా, కౌలురి నాగమణి, స్వరూప, ఐశ్వర్య, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
పత్తికి అంతుపట్టని తెగులు
పాల్వంచరూరల్: ఇప్పుడిప్పుడే ఏపుగా ఎదుగుతున్న పత్తి పంటకు గుర్తుతెలియని తెగులు వ్యాపించడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. మండలంలోని కోడిపుంజులవాగుకు చెందిన భూక్యా రవి ఐదెకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. ప్రస్తుతం చెట్లు ఏపుగా పెరుగుతున్నా ఇగురు, చిగురు రావడంలేదు. వచ్చిన ఆకులు సైతం ముడుచుకుపోగా నాలుగు సార్లు మందులు వాడినా ఫలితం లేదని రవి వెల్లడించాడు. పాల్వంచలోని డీలర్ వద్ద పత్తి విత్తనాలు కొనుగోలు చేయగా.. విత్తన లోపంతోనే ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. కాగా, వైరస్ మాదిరి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తెగులు వ్యాపించగా ఐదు ఎకరాల్లో పత్తి మొక్కలన్నీ ఇలాగే మారాయని వాపోయాడు.

ఆర్‌అండ్‌బీ రహదారిపై రోడ్లు వేసి నిరసన